
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
వేలూరు: విద్యుత్‌శాఖ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలకు చెందిన విద్యుత్ కార్మికులు కాట్పాడిలోని ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమిళనాడు విద్యుత్ కార్మికుల సంఘం వేలూరు జిల్లా అధ్యక్షుడు కామరాజ్, తిరుపత్తూరు జిల్లా అధ్యక్షుడు జయపాల్, క్రిష్ణగిరి జిల్లా అధ్యక్షుడు దురై అద్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి హాజరై మాట్లాడుతూ 2019వ సంవత్సరం నుంచి తమకు అందజేయాల్సిన ఆరు శాతం వేతన పెంపును వెంటనే కార్మికులను అందజేయాలని, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, విద్యుత్ షాక్‌తో గాయాలైన కార్మికులను కార్యాలయ ఆవరణలోనే విధులు నిర్వహించే విధంగా చూడాలని, ఒక జిల్లాకు చెందిన కార్మికులను మరొక జిల్లాలో విధులు నిర్వహించాలనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై విద్యుత్‌శాఖ సీనియర్ ఇంజినీర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరాజ్, కార్మికులు పాల్గొన్నారు.