
మరణదండన రద్దు
సాక్షి, చైన్నె: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి సజీవ దహనం చేసిన కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దశ్వంత్‌కు విధించిన మరణ దండనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నేరాన్ని నిరూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ, అతడిని కేసు నుంచి విడుదల చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. వివరాలు.. 2017 ఫిబ్రవరి 5వ తేదీన చైన్నె పోరూరు సమీపంలోని మౌలివాక్కం మదనందపురం మాతా నగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉన్న బాబు, శ్రీదేవి దంపతులు తమ కుమార్తె (6) కనిపించడం లేదని పోలీసుల్ని ఆశ్రయించారు. నాలుగు రోజుల అనంతరం మదుర వాయిల్ రహదారిలో సగం కాలిన స్థితిలో ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిపి హతమార్చినట్టు విచారణలో తేలింది. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. ఆ బాలిక కుటుంబం నివాసం ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని దశ్వంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ కిరాతకానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడి అంతటితో ఆగక ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి సజీవంగా తగులబెట్టి హతమార్చినట్టు విచారణలో తేలింది. అతడ్ని అరెస్టు చేసి కటకటాలలోకి నెట్టారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సమయంలో జులాయిగా మారిన దశ్వంత్ నగదు కోసం కన్న తల్లినిసైతం వేధించి హతమార్చాడు. మళ్లీ అతడ్ని కటకటాలలోకి నెట్టారు. జైల్లో ఉన్న దశ్వంత్‌కు ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో మరణ దండన విధిస్తూ చెంగల్పట్టు మహిళాకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని హైకోర్టు సైతం ధ్రువీకరించింది. దీనిని వ్యతిరేకిస్తూ దశ్వంత్ తరపున సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. ఈపిటిషన్‌విచారణ ముగించిన న్యాయ స్థా నం మరణ దండనను రద్దు చేసింది. అలాగే నేరాన్ని నిరూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ, జైల్లో ఉన్న అతడిని విడుదల చేస్తూ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై పీఎంకే నేత అన్బుమణి స్పందిస్తూ, బాలికల రక్షణ వ్యవహారంలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. నిందితుడికి శిక్ష పడేలాచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.