
రాందాసుకు తిరుమా పరామర్శ
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసును వీసీకే నేత తిరుమావళవన్ పోన్ ద్వారా పరామర్శించారు. పీఎంకే, వీసీకే పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రాష్ట్రంలో ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స తదుపరి ఇంటికి చేరిన రాందాసును తిరుమావళవన్ పోన్ ద్వారా పరామర్శించడం విశేషం. ఇది ఈ రెండు పార్టీల మధ్య ఆరోగ్యకర వాతావరణానికి పరిస్థితులు కల్పిస్తాయన్న చర్చ ఊపందుకుంది.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాం
సాక్షి, చైన్నె: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్(ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా డీఎంకే పోరాడుతుందని మంత్రి కేఎన్ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం మంత్రి స్థానికంగా మాట్లాడుతూ త్వరలో రాష్ట్రాలలో దీనిని అమలు చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితా అవకతవకల గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి స్పష్టంగా వివరించారని, ప్రశ్నలను సంధించారని గుర్తు చేశారు. అయితే ఇంత వరకు వీటికి సమాధానాలు ఎన్నికల సంఘం ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ ఉండటం శోచనీయమన్నారు. ఓటుహక్కును హరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలను అమలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను అడ్డుకునే విధంగా డీఎంకే పోరాడుతోందన్నారు. తమిళనాడు ప్రజలను మభ్య పెట్టడం కష్టం అని గ్రహించిన కేంద్రం ఎస్‌ఐఆర్ పేరిట ఓటర్ల హక్కులను టార్గెట్ చేసుకున్నట్టుందని మండిపడ్డారు. బిహార్‌లో లక్షలాది మంది పేర్లను ఓట్ల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తమిళనాడులో ఎస్‌ఐఆర్‌ను అడ్డుకుంటామని, ఇక్కడి ఓటర్లను తొలగించి బయటి ఓటర్లను చేర్చే ప్రయత్నంలో ఉన్న వారి కుట్రలను ఇక్కడ భగ్నం చేస్తామన్నారు. తమిళనాడు అంతా ఈ వ్యవహారంలో ఐక్యంగా ఉండి కుట్రదారులను అడ్డుకుంటుందని, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ ప్రదానం
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే 70వ రైల్వే వారోత్సవాలలో భాగంగా అత్యుత్తమ సేవలను అందించిన ఉద్యోగులు, సిబ్బందితోపాటుగా విభాగాలకు విశిష్ట్ రైల్ సేవా పురస్కార్, వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. దక్షిణ రైల్వే నేతృత్వంలో ఐపీఎఫ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ 2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా విభాగాలు, వర్క్ షాపులకు షీల్డ్‌లను అందజేశారు. అలాగే అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. వ్యక్తిగత అవార్డులను 105 మంది అధికారులు, సిబ్బంది అందుకున్నారు.వివిధ విభాగాలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు 38 ఎఫిషియన్సీ షీల్డ్‌లను వివిధ విభాగాలు, వర్క్ షాపులు, యూనిట్లకు అందజేశారు. ఇందులో ఇంటర్‌డివిజనల్ ఓవరాల్ ఎఫిషియెన్సీ విజేతగా పాలక్కాడ్ డివిజన్, రన్నర్‌గా చైన్నె, తిరువనంతపురం డివిజన్లు షీల్డ్‌ను అందుకున్నాయి.ఈ కార్యక్రమంలో దక్షిణ రైల్వే అదనపు జీఎం మహేశ్, ప్రిన్సిపల్‌చీఫ్ పర్సనల్ ఆఫీసర్ హరికృష్ణన్, ఇతర ప్రిన్సిపల్ విభాగాధిపతులు, ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లు, దక్షిణ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
మార్పునకు వేళాయెనా?
సాక్షి, చైన్నె : డీఎంకేలోజిల్లా స్థాయి కార్యవర్గాలలో మార్పునకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సన్నద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా రెండు జిల్లా మీద దృష్టి పెట్టి ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోదరా కదిలిరా నినాదంతో నేతలతో స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంనుంచి ఇ ప్పటి వరకు 50కు పైగానియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, అక్కడి జిల్లా కార్యదర్శులు, ఇతర ముఖ్య పదవులలో ఉన్న వారి పనితీరు గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో వచ్చే సమాచారాలు, ఫిర్యాదు ల ఆధారంగా తాజాగా స్టాలిన్ కొరడా ఝుళిపించే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కోయంబత్తూరు, తిరునల్వేలి కార్యదర్శులతోపాటుగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యదర్శులను మారుస్తూ బుధవారం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పదవులలో ఉన్న వారిలో కలవరం నెలకొన్నట్లు తెలుస్తోంది.

రాందాసుకు తిరుమా పరామర్శ

రాందాసుకు తిరుమా పరామర్శ