
● గాజా మారణహోమాన్ని ఖండిస్తూ నిరసన ● హాజరైన సీఎం స్టాల
సాక్షి, చైన్నె: సీపీఎం నేతృత్వంలో గాజా మారణహోమాన్ని ఖండిస్తూ ఎగ్మూర్‌లో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనకు సీఎం స్టాలిన్, సీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, ద్రవిడ కళగం నేత వీరమణి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతోగై, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీర పాండియన్, వీసీకే నేత తిరుమావళవన్, మనిద నేయమక్కల్‌కట్చి నేత, ఎమ్మెల్యే జవాహిరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత మహ్మద్ అబూ బక్కర్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, మనిద నేయ జననాయగ కట్చి నేత తమిమున్ అన్సారీ, సీపీఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బాలకృష్ణన్, రామకృష్ణన్, వాసుకీలతోపాటూ మంత్రి శేఖర్‌బాబు, డీఎంకే కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు హాజరయ్యారు. గాజాపై యుద్ధం ఆపాలని, ఇజ్రాయిల్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని నినాదాలు హోరెత్తించారు. గాజాలో పరిస్థితులు హృదయాల్ని ద్రవింప చేస్తున్నాయని, చిన్న పిల్లల ఆకలి కేకలు తీవ్రంగా కలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ నినదించారు. గాజా ప్రజల్ని ఆదుకోవాలని భారత ప్రభుత్వాన్ని, ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీలో తీర్మానం
మానవ హక్కులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దారుణాన్ని, అన్యాయాలను సర్వత్రా ఖండించాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజలకు ఆహారం, మందులు అందించేందుకు వెళ్తున్న స్వచ్ఛంద సేవకులను సైతం అడ్డుకోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. గాజాలో జరుగుతున్న కనికరంలేని మారణహోమం, పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ చేస్తున్న ఈ మారణ హోమాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుడుగు వేయాలని కోరారు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా అందరి తరపున బాధ్యత తీసుకుని ఒత్తిడి తెచ్చేందుకు తాను ముందడుగు వేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి , ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి గాజాలో శాంతిని నెలకొల్పుదామని, మానవతా సాయం అందిద్దామని భారత ప్రభుత్వాన్ని తాను విన్నవించుకుంటున్నట్టు పేర్కొన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, పాలస్తీనా పునరావాస ప్రణాళిక, గాజా పునర్నిర్మాణం. నిరంతర మానవతా సాయం అందించేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ, తమిళనాడు శాసనసభ సమావేశాలు ఈనెల 14న జరగనున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశాలలో గాజాలో ఇజ్రాయిల్ దాడి గురించి చర్చిద్దామని, అక్కడ తక్షణ కాల్పుల విరమణ అవసరాన్ని గుర్తు చేస్తూ, యుద్ధం ఆపే విధంగా పట్టుబడుతూ, భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఒత్తిడి తెచ్చే విధంగా ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ తీర్మానం తీసుకొస్తామని ప్రకటించారు. ఈ తీర్మానం తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని, రాజకీయ విభేదాలను అధిగమించి అందరినీ ఆలింగనం చేసుకుంటుందని అన్నారు. ఈ తీర్మానానికి పార్టీలు కూడా మద్దతు ఇస్తాయనిు పూర్తి నమ్మకం ఉందన్నారు. అమాయకుల ప్రాణల్ని బలి కొంటున్న ఈ యుద్ధాన్ని ఇకనైనా ఆపండి అంటూ అందరితో కలిసి నినాదాలను సీఎం స్టాలిన్ హోరెత్తించారు.
నిరసనలో సీఎం స్టాలిన్‌తో పాటూ కూటమి పార్టీల నేతలు
హృదయం ద్రవిస్తోంది..
ఈ నిరసనలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, గాజాపై ఇజ్రాయిల్ విచక్షణారహిత దాడులు అందరి హృదయాలనూ ద్రవింప చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని పరిస్థితులను చూసిన ప్రపంచ దేశాల ప్రజలు సైతం కన్నీళ్లు పెడుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, ఐక్యరాజ్య సమితి సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించి ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతుండటం విచారకరం అని వ్యాఖ్యాలు చేశారు. పాలస్తీనా ప్రజలకు పూర్తి మద్దతును అందిస్తున్నామని, యుద్ధం ఆపాలన్న ఈ నిరసన ఒక ఉద్యమ నినాదంగా మారాలని పిలుపు నిచ్చారు. గత సంవత్సర కాలానికి పైగా అడ్డూఅదుపు లేకుండా ఇజ్రాయిల్ జరిపిన దాడులలో సుమారు 11 వేల మంది మహిళలు, 17 వేల మంది పిల్లలు, 175 మంది పాత్రికేయులు – 125 మంది యూఎన్ సిబ్బంది అంటూ వేలాది మంది మరణించి ఉన్నారని వివరించారు. 26 వేల మందికిపైగా పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారని, లక్షలాది మంది ఆస్పత్రులలో సరైన చికిత్స అందక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఎక్కువ భాగం సర్వనాశనమైనా, ఇజ్రాయిల్ తన విధానాన్ని మార్చుకోకుండా దాడులు కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆకలితో అలమటిస్తున్న పెద్దలు, పిల్లల గోడు ఇజ్రాయికు కనిపించడం లేదా..? అని మండిపడ్డారు. ఈ క్రూరత్వాన్ని చూసి హృదయాలు బద్ధలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.