
సిట్‌కు వ్యతిరేకంగా టీవీకే పిటిషన్
సాక్షి, చైన్నె: కరూర్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు వ్యతిరేకంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ తరపున సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ గత నెల 27న కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. ఈ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం విచారిస్తోంది. తన విచారణను ఈ బృందం వేగవంతం చేసింది. ఈ పరిస్థితులలో ఈ బృందం విచారణకు స్టే విధించాలని కోరుతూ విజయ్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆది నుంచి ఈ కేసులో సీబీఐ విచారణకు విజయ్ పట్టుబడుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సిట్ విచారణను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కరూర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇందు కోసం తనకు అనుమతి ఇవ్వాలని, భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. విజయ్ తరపున పార్టీ వర్గాలు బుధవారం డీజీపీ కార్యాలయంలో వినతి పత్రాన్ని, విజయ్ తరపున లేఖను అందజేశారు.
విజయ్
గాయపడ్డ వారికి సాయం..
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈకుటుంబాలను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించి ఆ మొత్తానికి గాను చెక్కులను అందజేశారు. తాజాగా గాయపడ్డ వారికి ప్రకటించిన రూ. లక్ష సాయం పంపిణీకి బుధవారం చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ తొలి రోజున పలు కుటుంబాలను కలిసి చెక్కును అందజేశారు. కాగా ఈ కేసు విచారిస్తున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ అరుణా జగదీశన్ మరోమారు కరూర్‌లో ఈనెల 11వ తేదీన విచారణ జరిపేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, విజయ్‌కు మద్దతుగా ఆయన పార్టీ వర్గాలు ఎంజీఆర్ చిత్రాలలోని పాటలను గుర్తు చేస్తూ, అనేక చోట్ల పోస్టర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.