
నేతలకు ఉదయనిధి, కమల్ పరామర్శ
సాక్షి, చైన్నె : రెండు పార్టీల అధినేతలు అపోలో ఆస్పత్రిలో ఉండడంతో వారిని పరామర్శించేందుకు ఇతర పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సైతం అపోలో ఆస్పత్రిలోచికిత్సలో ఉన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు చైన్నె అపోలో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వైగోను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాందాసు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్ వైగో, రాందాసులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అలాగే, బద్రీనాధ్ పర్యటనలో ఉన్న సినీ నటుడు రజనీకాంత్ రాందాసును ఫోన్ ద్వారా పరామర్శించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థత కారణంగా అపోలోలో చేరారు. ఆయనకు వైద్యులు పరిశోదనలు నిర్వహించారు. సాధారణ పరీక్షలేనని ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని అపోలో వర్గాలు ప్రకటించాయి.
కొత్త మోసగాళ్లు!
– జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
సాక్షి, చైన్నె : విద్యా రుణాలు, స్కాలర్ షిప్‌ల పేరిట కొత్త మోసగాళ్లు తెర మీదకు వచ్చినట్టు పోలీసులు హెచ్చరించారు. సెల్‌ఫోన్లు వచ్చే ఇలాంటి కాల్స్‌ను విస్మరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మోసగాళ్లు రోజుకో కొత్త రకం మార్గాలను ఎంచుకుంటూ వస్తున్నారు. పోలీసులు కేసులు చేధించే కొద్ది, కొత్త కొత్త అన్వేషణలతో జనాన్ని బురిడి కొట్టించే పనిలో మోసగాళ్లు ఉన్నారు. తాజాగా ప్రభుత్వం విద్యార్థులకు మద్దతుగా అమలు చేస్తున్న పథకాలను అస్త్రంగా చేసుకుని తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలలోని నగదును మాయం చేసే యత్నాలలో ఉన్నట్టు పోలీసుల దృష్టికి చేరింది. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్‌లు మంజూరైనట్టు, బ్యాంక్ రుణాలు మంజూరైనట్టు, ఇతర నగదు ప్రోత్సాహాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా అనర్గళంగా తమిళంలో మాట్లాడుతూ మోసాలకు పాల్పడే ముఠా గుట్టు ఓ విద్యార్ధి తండ్రి ద్వారా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ నంబర్లు సేకరించి, విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారాలు సేకరించి ఫోన్ కాల్స్ చేస్తూ రావడం బయట పడింది. తమ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వివరాలను తెలియజేస్తుండడంతో తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి ఉండటం గమనార్హం. తమ పిల్లల పేరిట స్కాలర్ షిప్‌లు, రుణాలు మంజూరైందన్న ఆనందంతో మోసగాళ్లు అడిగే వివరాలను ఇచ్చేసి, చివరకు ఓటీపీ వచ్చినట్టుగా పేర్కొంటూ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం చేసే పనిలో ఈ ముఠా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి విద్యా సంబంధిత ఫోన్‌కాల్స్‌ను విస్మరించాలని హెచ్చరిస్తున్నారు. మోసగాళ్ల మాయ మాటలను నమ్మి మోస పోవద్దని, బ్యాంక్ డీటైల్స్ వంటి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని చైన్నె సైబర్ క్రైం పోలీసులు సూచించారు.
32 పోస్టుల భర్తీకి
ఎన్‌పీఎస్సీ నోటిఫికేషన్
తిరువొత్తియూరు:గ్రూప్ 5ఏ పోస్టులలో ఖాళీగా ఉన్న 32 పోస్టులను భర్తీ చేయడానికి టీఎన్‌పీఎస్‌సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. వివరాలు.. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–గ్రూప్ 5ఏ పోస్టుల కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులలో హెడ్ ఆఫీస్ (లా అండ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్స్ మినహా) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 22 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3 పోస్టులు, హెడ్ ఆఫీస్ (లా అండ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్స్ మినహా) అసిస్టెంట్ 5 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం 32 పోస్టులను భర్తీ చేయడానికి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) కార్యదర్శి గోపాల సుందరరాజ్ మంగళవారం తెలిపిన ప్రకటనలో పేర్కొంటూ.. ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గ్రూప్ 5ఏ పోస్టుల కోసం 2025 సంవత్సరానికి టీఎన్‌పీఎస్‌సీ వార్షిక ప్రణాళికలో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మంగళవారం నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష డిసెంబర్ 21న నిర్వహిస్తామన్నారు.