
బాధితులకు విజయ్ వీడియో కాల్
సాక్షి, చైన్నె: కరూర్ బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 27వ తేదీన కరూర్‌లో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్‌కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు. అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఈ పరిస్థితులలో బాధితులకు విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించడం వెలుగులోకి వచ్చింది. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించి నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
వేదనను పంచుకుంటూ..
బాధిత కుటుంబాల వేదనలో తాను పాలు పంచుకుంటున్నట్టు విజయ్ పేర్కొని, తాను ఉన్నానన్న భరోసాను ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే త్వరలో అందర్నీ స్వయంగా వచ్చి కలుస్తానని విజయ్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఘటనకు పూర్తి బాధ్యతను విజయ్ వహించాలని వీసీకే నేత తిరుమావళవన్ డిమాండ్ చేశారు. కరూర్‌లో బాధితుల చిత్ర పటాలకు నివాళులర్పించినానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయ్‌పై చట్ట పరంగా ఈ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ నేత హెచ్ రాజ మాట్లాడుతూ, ఈ ఘటన జరిగిన సమాచారంతో విజయ్ చైన్నెకు తిరుగు పయనమై పెద్ద తప్పు చేశారని మండి పడ్డారు. ఆయన అక్కడే ధైర్యంగా ఉండి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక, మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమల్ పేర్కొంటూ, కరూర్ వ్యవహారం విచారణ లో ఉందని, ఇక పదేపదే దీని గురించి మాట్లాడడం అందరూ తగ్గించాలని హితవు పలికారు.