
పెరుగుతున్న డెంగీ కేసులు
సాక్షి, చైన్నై: రాష్ట్రంలో డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. గత మూడు వారాలలో అమాంతం కేసుల సంఖ్య పెరిగినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో పశ్చిమ కనుమలలోని జిల్లాలలో సంవృద్ధిగా వర్షాలు పడ్డాయి. మిగిలిన జిల్లాలో మోస్తరుగా వర్షం కురిసింది. ఈ పవనాల సీజన్ ముగియడంతో ప్రస్తుతం ఈశాన్య సీజన్ ప్రవేశం నిమ్తితం ఎదురు చూపులలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా వాతావరణం పూర్తిగా మారింది. ఎండ, వాన, చలి అంటూ అనేక జిల్లాలో ప్రభావం ఉంటూ వస్తోంది. చైన్నె, శివారు జిల్లాలతోపాటూ పది జిల్లాలలో ప్రస్తుతం తెరపించి తెరపించి వర్షం పడుతోంది. కొన్ని సందర్భాలలో భారీ వర్షం కూడా అనేక చోట్ల కురిశాయి. ఈ వాతావరణ మార్పుతో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారికి సంఖ్య పెరుగుతోంది. చైన్నె, శివారులతో పాటూ పలు జిల్లాలో క్లీనిక్‌లు, ప్రభుత్వ ఆస్పత్రులకు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. వీరిలో అనేక మంది డెంగీ , కరోనా పరిశోదనలు సైతం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం కలవరం రేపుతోంది. ఈ వివరాలను స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ మంగళవారం ప్రకటించారు. చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత మూడు వారాలలో రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య పెరిగినట్టు వివరించారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య చికిత్స అందుతున్నాయని పేర్కొన్నారు. డెంగీ నివారణ చర్యలు విస్తృతం చేస్తున్నామని, అదే సమయంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ నివారణే లక్ష్యంగా పది వేల వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, ఎక్కడెక్కడ కేసులు అధికంగా ఉన్నాయో ఆరాతీసి, శిబిరాలను విస్తృతం చేయడానికి అధికారులతో సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు.