
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలి
తిరువళ్లూరు: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, తమకు ఆంధ్రప్రదేశ్ తరహాలో పరిహారం ఇవ్వాలని హిందూ ఆటో మున్ననీ నేతలు సోమవారం ఉదయం కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం హిందూ మున్ననీ ఆటో యూనియన్ కాంచీపురం మండల కార్యదర్శి వినోద్‌కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉబర్, ఓలా వాహనాలు పెరగడం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో సాధారణ ఆటో డ్రైవర్లత జీవనంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రభుత్వం తమకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు అప్పటి ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేలు వారి అకౌంట్‌లో జమ చేసి, ఆదుకుందన్నారు. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం సైతం రూ.15 వేలు అందించిందన్నారు. ఈ క్రమంలో తమిళనాడులోనూ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు.