
ఆస్పత్రిలో రామన్న
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో వైద్యులు పరిశోధనలతో చికిత్సలు అందిస్తున్నారు. పీఎంకే నేత రాందాస్ గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న విషయం తెలిసిందే. తనయుడు అన్బుమణి రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులతో మొదలైన వివాదాలు రాందాస్‌ను తీవ్ర మనో వేదనకు గురి చేశాయి. తనకు వ్యతిరేకంగా తనయుడు సాగిస్తున్న వ్యవహారాలపై తీవ్రంగా మండి పడుతూ వచ్చారు. ఈ పరిస్థితులలో సోమవారం ఉదయాన్నే రాందాస్ చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. గుండె, యాంజియో సంబంధిత పరిశోధనలను డాక్టర్ సెంగుట్టువేల్ నేతృత్వంలోని బృందం చేపట్టింది. తండ్రి ఆస్పత్రిలో చేరిన సమాచారంతో అన్బుమణి అక్కడకు చేరుకున్నారు. అయితే ఆరు గంటలపాటుగా రాందాస్‌ను చూసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
రాందాస్‌కు గుండెకు సంబంధించిన రక్త నాళాలు బాగానే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్బుమణి వ్యాఖ్యానించారు. రెండు రోజులలో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. పీఎంకే గౌరవ అధ్యక్షుడు జీకే మణి మాట్లాడుతూ ఆరు గంటలు ఎవరూ చూసేందుకు వీలు లేదని వైద్యులు చెప్పడంతోనే అన్బుమణి చూడలేకపోయారని పేర్కొన్నారు. రాందాస్ ఆరోగ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాందాస్‌ను సీఎం స్టాలిన్, మంత్రులు నెహ్రు, ఏఈ వేలు ఆస్పత్రికి చేరుకుని, పరామర్శించారు. రాందాస్‌ను కలిసి భరోసా ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ సైతం రాందాస్‌ను పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎండీఎంకే నేత వైగోను సైతం ఆయన పరామర్శించడం గమనార్హం. ఇంత వరకు సీమాన్, వైగో నేరుగా కలుసుకున్న సందర్భాలు లేవు. తాజాగా వైగోను సీమాన్ పరామర్శించడం గమనించి దగ్గ విషయం.

ఆస్పత్రిలో రామన్న