
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వాసుపత్రులు
వేలూరు: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులలో రోగులకు అవసరమైన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గంలోని సేర్‌కాడు గ్రామంలో రూ.15.69 కోట్లు వ్యయంతో 60 పడుకల ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన సీఎం స్టాలిన్ చైన్నె రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో సేర్‌కాడులో మంత్రులు సుబ్రమణియన్, దురై మురుగన్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా తనతోపాటు తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఆసుపత్రిలో తనఖీలు నిర్వహించి రోగులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ కాట్పాడి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని వసతులు చేసేందుకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఇప్పటికే కాట్పాడిలో కోర్టు, తాలూకా కేంద్రం, ప్రభుత్వ న్యాయ కళాశాలతోపాటు అన్ని కార్యాలయాలను కాట్పాడికి తీసుకువచ్చామన్నారు. సేర్‌కాడు ప్రాంతం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేలూరు ప్రభుత్వాసుపత్రి ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడడంతోనే ఇక్కడ ప్రభుత్వాసుపత్రిని నిర్మించామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జడ్పీ చైర్మన్ బాబు, యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.