
పోలీసు అధికారుల సేవలకు ప్రశంసలు
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో పోలీసు అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో అదనపు పోలీసు కమిషనర్ ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులను అభినందించి, సర్టిఫికెట్లను అందజేశారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఒక మినిస్టీరియల్ సూపరింటెండెంట్, ఐదుగరు పోలీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు , ముగ్గురు స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లతో సహా మొత్తం 9 మంది మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు అధికారులు గత నెల 30వ తేదీ పదవీ విరమణ చేశారు. చైన్నె నగర పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ ఆదేశాల మేరకు, అదనపు పోలీస్ కమిషనర్ విజయేంద్ర బిధారి వీడ్కోలు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్‌లో 25 సంవత్సరాలకు పైగా వారి అద్భుతమైన పనిని ప్రశంసించారు. వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి, సర్టిఫికెట్లు అందజేశారు. పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు, వారి ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్లు డి.ఎన్.హరికిరణ్ ప్రసాద్(వెల్ఫేర్ అండ్ ఎస్టేట్), జి. సుబ్బులక్ష్మి(అడ్మినిస్ట్రేషన్), పోలీసు అధికారులు, పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.