
జనం రద్దీ
కిటకిటలాడిన రహదారులు
టోల్‌గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు
తప్పని ట్రాఫిక్ కష్టాలు
దీపావళికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, చైన్నె చైన్నెలో ఉద్యోగ, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వారు దసరా పర్వదినాన్ని తమ కుటుంబాలతో చేసుకునేందుకు స్వస్థలాలు, స్వగ్రామాలకు గత వారం బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సారి పండుగ సెలవులకు, త్రైమాసిక పరీక్షల అనంతరం సెలవులు కలిసి వచ్చాయి. దీంతో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు అధికం. సోమవారంతో సెలవులు ముగిశాయి. దీంతో ఉదయాన్నే జనం మళ్లీ చైన్నెకు చేరుకున్నారు. చైన్నె వైపుగా ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కదిలాయి. ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలలో వెళ్లి వారంతా ఒక్క సారిగా తిరుగు పయనం కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అన్ని టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు చైన్నె వైపు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఈ బస్సులన్నీ ఉదయాన్నే నగర శివారుల్లోకి ప్రవేశించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అవస్థలు తప్పలేదు.
దీపావళి స్పెషల్
దసరా వేళ చోటు చేసుకున్న రవాణా, ట్రాఫిక్ కష్టాలను పరిగణించి, దీపావళి సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలపై రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సోమవారం రవాణా మంత్రి శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ వాహనాలన్నీ ఒకే సారిగా రావడంతో రహదారి స్తంభించిందని, అయినా ట్రాఫిక్‌ను సిబ్బంది క్లియర్ చేశారనాన్నరు. రద్దీ కారణంగా ప్రయాణ సమయం అదనంగా పట్టిందన్నారు. దీపావళి సందర్భంగా తాజా సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20,378 బస్సులను నడపనున్నామని, చైన్నె నుంచి 14,268 బస్సులను రోడ్డెక్కించనున్నామని ప్రకటించారు.
దసరా, విజయ దశమి పండుగ, త్రైమాసిక పరీక్షా సెలవులను ముగించుకుని స్వస్థలాల నుంచి జనం చైన్నెకు తిరుగు పయనమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో కిటకిటలాడడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.