
‘సిట్’ విచారణ వేగవంతం
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై సిట్ విచారణ వేగం పుంజుకుంది. రెండో రోజు ఈ ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలు, గాయపడిన వారి వద్దకే నేరుగా వెళ్లి సిట్ అధికారుల బృందం విచారణ జరిపి, సమాచారాన్ని సేకరించింది. కరూర్‌లోని టీవీకే నాయకులను సైతం విచారించాలని ఈ బృందం నిర్ణయించింది. కరూర్ ఘటనను ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆదివారం సంఘటనా స్థలంలో పరిశీలన, కరూర్ పోలీసులతో సమావేశాలు నిర్వహించిన ఈ బృందం, రెండో రోజైన సోమవారం ఉదయం కరూర్, పరిసరాలకు చెందిన బాధిత కుటుంబాల వద్దకు పలు బృందాలు వెళ్లాయి. మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం సేకరించాయి. గాయపడి కోలుకున్న వారి వద్ద సమగ్ర సమాచారాలు సేకరించింది. రద్దీ పెరిగేందుకు కారణం, ఆ సమయంలో ఏమి జరిగింది.. అక్కడి పరిస్థితులపై ఆరా తీసింది. అలాగే, సభ నుంచి స్వచ్ఛంగా వెళ్లారా? లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? అని అధికారులు విచారించారు. ఈ విచారణ మేరకు టీవీకే స్థానిక నాయకులను విచారించేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న నాయకుల జాబితాను సిట్ బృందం సేకరిస్తోంది. ఇదిలావుండగా, కోర్టు సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో చేసిన వాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కొందరు యూ ట్యూబర్లు టీవీకేకు అనుకూలంగా స్పందించడంతో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చైన్నెలో పలువుర్ని అరెస్టు చేయగా, సోమవారం పుదుకోట్టై, కృష్ణగిరికి చెందిన టీవీకే నాయకులను ఆయా జిల్లాల పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాల కార్యదర్శులతో భేటీకి విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అన్ని జిల్లాల కార్యదర్శులు చైన్నెకు రావాలన్న ఆదేశాలు వెళ్లి ఉన్నాయి. ప్రస్తుతం ప్రచార పయనం రెండు వారాలకు వాయిదా పడినా, ఆ తదుపరి ముందుకు తీసుకెళ్లే విషయమై చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు విజయ్ కసరత్తు చేపట్టినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి కరూర్‌లో పర్యటించిన ఎంపీ హేమామలిని నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికను సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, కరూర్‌లో బాధితులను మక్కల్ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్ పరామర్శించారు.