
సముద్రంలో లంక దొంగల భీభత్సం
సాక్షి, చైన్నె : సముద్రంలో శ్రీలంక దొంగలు భీభత్సం సృష్టించారు. తమిళ జాలర్లపై దాడులు చేశారు. 11 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగపట్నం నంబియార్ నగర్‌కు చెందిన జాలర్లు ఆదివారం వేటకు వెళ్లారు. కొడికయరై సమీపంలో జాలర్లు వలలను విసిరి వేటలో నిగమ్నమయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు అనే వ్యక్తికి చెందిన పడవపై అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా శ్రీలంక నుంచి వచ్చిన దొంగలు దాడులు చేశారు. వచ్చి రాగానే ఆయుధాలతో దాడి చేసి, పడవలో ఉన్న జీపీఎస్, బ్యాటరీలు, అదనపు మోటార్ ఇంజిన్లు, తదితర పరికరాలతోపాటు తమిళ జాలర్ల మెడలో ఉన్న వెండి గొలుసులను పట్టుకెళ్లారు. తీవ్ర గాయాలతో అతి కష్టంపై ఒడ్డుకు చేరిన జాలర్లు జరిగిన సమాచారాన్ని సోమవారం ఉదయాన్నే అధికారులకు తెలియజేశారు. 11మంది గాయలతో ఆస్పత్రిలో చేరారు. వీరంతా నంబియార్ నగర్‌కు చెందిన విఘ్నేష్, విమల్, సుకుమార్, తిరుమురుగన్, మురుగన్, అరుణ్, చంద్రబాబుగా గుర్తించారు. శివశంకర్ అనే జాలరి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తంజావూరు ఆస్పత్రికి తరలించారు. తమ వారిపై సముద్రంలో శ్రీలంక దొంగలు దాడి చేశారన్న సమాచారంతో నంబియార్ నగర్ జాలర్లు సోమవారం చేపల వేటను బహిష్కరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. జాలర్లపై దాడిని తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తీవ్రంగా ఖండించారు. జాలర్లకు భద్రత కల్పించాలని, గాయపడిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సమీపంలోని కారైక్కాల్ జాలర్లు, ఆంధ్రా సరిహద్దులోని జాలర్ల మధ్య సముద్రంలో గొడవ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.