
క్లుప్తంగా
మోటార్ సైకిల్‌పై
యువకుడి ఫీట్లు
తిరువొత్తియూరు: రోడ్డుపై వాహనచోదకులను భయపెట్టేలా మోటార్ సైకిల్ స్టంట్లు చేస్తున్న యువకులపై పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. అయితే, వారాంతాల్లో అంబత్తూరు బైపాస్ రోడ్డు, తూర్పు తీర రహదారి, మెరీనా బీచ్ రోడ్లలో తరచుగా మోటార్ సైకిల్ రేసులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబత్తూరు–మధురవాయల్ బైపాస్ రోడ్డులో యువకులు మోటార్ సైకిల్‌పై స్టంట్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మోటార్ సైకిల్ ముందు చక్రం పైకి లేపి, యువకులు ప్రమాదకరంగా అరుస్తూ అతివేగంగా వెళ్లారు. దీనిని చూసిన ఇతర వాహనచోదకులు భయంతో వెళ్లడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఆధారంగా మోటార్ సైకిల్‌పై సాహసయాత్ర చేసిన యువకుల గురించి పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
రూ. 1,002 కోట్లు పన్ను వసూలు
కొరుక్కుపేట: ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపులు, బ్యాంక్ బదిలీలు, ప్రత్యక్ష డెబిట్‌లు, మొబైల్ ఫోన్ చెల్లింపుల ద్వారా అర్ధ వార్షిక పన్నులు వసూలు చేశామని, తద్వారా కార్పొరేషన్‌కు రూ.1,002 కోట్లు ఆదాయం వచ్చిందని కార్పొరేషన్ కమిషనర్ కె.మహేష్ తెలిపారు. చైన్నె మహానగర రెవెన్యూ విభాగం సంవత్సరానికి రెండు సార్లు పన్నులు వసూలు చేస్తోంది. ప్రస్తుతం పన్నులు వసూలు చేయడాన్ని సులభతరం చేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కంటే ఎక్కువ పన్నులు చెల్లించారు.
విజయవంతంగా వాల్వ్ మార్పిడి
సాక్షి, చైన్నె: హైబ్రీడ్ మిట్రల్ వాల్వ్‌ను ఆళ్వార్‌పేట కావేవరి ఆస్పత్రి వైద్యులు రీప్లేస్‌మెంట్ చేసి వైద్య చరిత్రలో కొత్త రికార్డును నమోదు చేశారు. 83 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధ మహిళకు ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం కావేరి ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యుడు అరుణ్‌కుమార్ కృష్ణస్వామి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ అనంతరామన్, ఆసిక్ అలీ, మహేశ్‌కుమార్‌లతో కూడిన బృందం ఈ వివరాలను స్థానికంగా ప్రకటించింది. తీవ్రమైన మిట్రల్ యాన్యులర్ కాల్సిఫికేషన్‌తో కలిగే తీవ్రమైన సమస్యతో మిట్రల్ వాల్వ్ పనిచేయక పోవడంతో గుండె ఆగి పోయే పరిస్థితి రావడంతో వృద్ధురాలు పదే పదే ఆస్పత్రిలో చేరాల్సి ఉండేదన్నారు. గతంలో ఆమెకు రెండు సార్లు ఛాతీకి రేడియో థెరపీ నిర్వహించి ఉన్నారని, మొదట అన్నవాహిక క్యాన్సర్‌కు, ఆతర్వాత రొమ్ము క్యాన్సర్‌కు శస్త్ర చికిత్స చేసినట్టు పేర్కొన్నారు. తాజాగా శ్వాస ఆడక పోవడం, అలసట, గుండె సమస్యలతో ప్రమాదకరంగా ఆస్పత్రిలో చేరిన ఆమెకు జరిపిన పరిశోధనతో ట్రాన్స్–కాథెటర్ టెక్నిక్‌ను ప్రయోగించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కుడి తొడ సిర ద్వారా ఈ ప్రక్రియను విజయవంతం చేశామన్నారు. ఇది వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా ప్రకటించారు. ప్రాణాలను రక్షించే సంరక్షణ అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నప్పటికీ, ఆధునిక పద్ధతులతో విజయవంతంచేశామన్నారు.
పల్లవరం–పుత్తేరి సరస్సు పునరుద్ధరణ
కొరుక్కుపేట: పల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం తాంబరం కార్పొరేషన్ పుత్తేరి సరస్సును శుభ్రం చేసి పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో రూ.8.15 కోట్లతో పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించారు. ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ ఎమ్మెల్యే ఇ.కరుణానిధి ఈ విషయాన్ని మంత్రి శేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీని తరువాత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశాల మేరకు చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ సరస్సును శుభ్రం చేసి, పిల్లల ఆటస్థలం, గ్రీన్ లైన్ చుట్టుకొలత గోడ, బెంచీలు, టాయిలెట్లు, సరస్సు కట్టను బలోపేతం చేయాలని ప్రణాళిక వేశారు. దీనికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. మంత్రులు థామోఅన్బరసన్, పి.కె. శేఖర్‌బాబు పాల్గొని, శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

క్లుప్తంగా