
మాతృభాష పరిరక్షణకు కృషి
కొరుక్కుపేట: మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగువారు తమ పిల్లల్ని మాతృభాషలోనే చదివించాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక కీల్పాక్‌లోని ఏఐటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో సీఎంకే రెడ్డి జన్మదిన వేడుకలను మాతృభాష సంరక్షణ దినోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.చంద్రమోహన్, ఏడీజీపీ డి.కల్పన నాయక్, వీరపాండ్య కట్టబొమ్మన్ వంశీకులు ఇళయా కట్టబొమ్మన్, తెలుంగర్ మున్నెట్ర కళగం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బాలాజీ నాయుడు, తెలుగు ప్రముఖులు, తెలుగు సంస్థల ప్రతినిధులు డాక్టర్ సీఎంకే రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నమో గాడ్ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సీఎం కిషోర్ నిర్వహించగా, ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ స్వాగతం పలికారు. డాక్టర్ ఎన్.నాగభూషణం వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో భాగంగా 100 మందికి పైగా నిరుపేద ప్రజలు, పారిశుధ్య కార్మికులు, వృద్ధులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ ఏఐటీఎఫ్ తెలుగువారందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారి సమస్యలపై సమైక్యంగా పోరాడి స్ఫూర్తిని కలిగించిందన్నారు. తమిళనాడులో నివశించే తెలుగు ప్రజలంతా ఐక్యతతో ఉంటేనే మాతృభాషను కాపాడుకోవడంతోపాటు హక్కులను సాధించుకోవచ్చని ఆయన ఉద్ఘాటించారు. ఏడీజీపీ కల్పన నాయక్ మాట్లాడుతూ విద్య, వైద్యం, సామాజిక రంగాలకు ఆయన అందిస్తున్న సేవలు ఆపారమని కొనియాడారు. ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షుడు లయన్ వీజీ జయకుమార్, కోశాధికారి కేవీ జనార్ధనం, నిర్మల్ చందర్, సీబీ భుజంగరామ్, వంజరపు శివయ్య, తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు వి.అనంతరామన్, లయన్ జి.మురళి, డాక్టర్ ఏ.వీ.శివకుమారి, కాంగ్రెస్ నేత విల్లివాక్కం సురేష్, పాల్ కొండయ్య, అద్దంకి ఐసయ్య, వి.దేవదానం, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు, కార్యదర్శి పీఆర్ కేశవులు, ఎస్‌కేడీటీ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.