
ప్రపంచ వ్యాప్తంగా తమిళులకు చేరాలనే..
తమిళసినిమా: కమర్షియల్ కథా చిత్రాల జోలికి పోకుండా, ప్రజలకు కావాల్సిన, వారు తెలుసుకోవాల్సిన కథాంశాలతో చిత్రాలను చేస్తున్న దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్. ఈయన రమణ కమ్యునికేషన్ పతాకంపై ఇంతకు ముందు దివంగత రాజకీయ నేత కామరాజర్ జీవిత చరిత్రను కామరాజ్ పేరుతో, గాంధీజీ జీవిత చరిత్రను వెల్‌కమ్ బ్యాక్ గాంధీ పేరుతోనూ చిత్రాలను రూపొందించి మంచి విజయాలను, ప్రశంసలను పొందారు. అదే విధంగా ఇటీవల తమిళంలో ప్రఖ్యాతి గాంచిన ప్రపంచవ్యాప్తంగా తమిళులు ఎంతగానో అభిమానించే తిరువళ్లువర్ జీవిత కథతో తిరుక్కురల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ మధ్య తెరపైకి వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని యూట్యూబ్ చానల్‌లో ఉచితంగా ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏజే బాలకృష్ణన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ విశ్లేషకుడు, నటుడు చిత్రా లక్ష్మణన్, పారిశ్రామిక వేత్త వీజీపీ సంతోషం, రామరాజ్ గ్రూప్ అధినేత కేఆర్ నాగరాజన్, నిర్మాత పీఎల్.తేనప్పన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువళ్లువర్ ఏ కులానికి చెందిన వారో, ఏ మతానికి చెందిన వారో తెలియదనీ, తెలిసింది ఒక్కటే ఆయన తమిళుడు అని పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్ మాట్లాడుతూ తిరుక్కురల్ చిత్రాన్ని నిర్మించడానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు అన్నారు. చిత్రం విడుదలైన తరువాత సద్విమర్శలు వచ్చాయని, అయితే థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రాలేదన్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేర్చాలన్న ఆలోచనతో యూట్యూబ్ చానల్‌లో ఉచితంగా అందించాలని భావించామన్నారు. దీనికి రామరాజ్ గ్రూప్ అధినేత నాగరాజన్ ప్రకటన ఇచ్చి, కార్డు మాత్రమే వేయమని ఉదార మనసుతో పేర్కొన్నారన్నారని, ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. తిరుక్కురల్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చేర్చి కాలాన్ని అధిగమిస్తుందనే నమ్మకం ఉందని ఏజే.బాలకృష్ణన్ పేర్కొన్నారు.