
విద్యార్థులకు ఉపకార వేతనాలు
వేలూరు: బంగారుగుడి ఆధ్వర్యంలోని విద్యా నేత్రం పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్న అనంతరం ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని బంగారుగుడి శ్రీనారాయణి పీఠం పీఠాధిపతి శక్తిఅమ్మ అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడిలో విద్యా నేత్రం పథకం కింద గ్రామీణ నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం పీఠాధిపతి శక్తిఅమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ కిషోర్ బగవానాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు శక్తిఅమ్మ స్కాలర్‌షిప్‌లు అందజేయడం అభినందనీయమన్నారు. భక్తితోపాటు వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేయడం, పర్యావరణం కోసం చెట్లు నాటడం తదితర కార్యక్రమాలను చేస్తుండడం సంతోషకరమన్నారు. పీఠాధిపతి శక్తిఅమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ విజయం అనే విషయం గొప్పదన్నారు. విజయంతోపాటు సాధన చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. విజయం అనేది మనం మాత్రమే సంతోషించే విషయం. అయితే సాధన చేయాలంటే మంచి పనులను చేయగలిగితేనే అది సాధ్యమన్నారు. మంచి పనులంటే ఉన్న వాటిలో ఇతరులకు సాయం చేయడం ద్వారా ఆత్మ సంతృప్తిని ఇవ్వడంతోపాటు చరిత్రలో స్థానం సాదించవచ్చున్నారు. మనం చేసే పాపం, పుణ్యమై మనకు తిరిగి వస్తుందని మరణాంతరం మానవుడు ఎటువంటి ఆస్తులను తీసుకెళ్లలేడని, అయితే చేసిన పాపాలు, పుణ్యం మాత్రమే తీసుకెళ్లగలడన్నారు. అనంతరం నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ విమాన యాన సంరక్షణ డీఐజీ పొన్ని, చైన్నె హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్, బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు, నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, ఆలయ మేనేజర్ సంపత్, ట్రస్టీ సౌందర్‌రాజన్ తదితరులు పాల్గొన్నారు.