
సహకార బ్యాంకు ఉద్యోగుల ధర్నా
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ప్రాథమిక సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్ అధ్యక్షత వహించాడు. జిల్లా పోరాట కమిటీ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి నిబంధనలు లేకుండా 20 శాతం వేతనం పెంచడంతోపాటు 2021 సంవత్సరం అనంతరం విధుల్లో చేరిన వారందరికి పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, తాత్కాలిక పని విధానాలను రద్దు చేసి, సీనియారిటీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మొత్తం 25 డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళనను తీవ్ర తరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా కోశాధికారి ఆనందన్, ఉపాధ్యక్షుడు ధర్మలింగం, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.