
కమనీయం.. శ్రీనివాస తిరుకల్యాణం
మార్మోగిన పెరంబూరు
కొరుక్కుపేట: శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాల్‌కు తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా సాగింది. శ్రీ వేంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సెప్టంబర్ 27వ తేదీ నుంచి చైన్నె పెరంబూరు పటేల్ రోడ్డులో ఉన్న సమాజానికి చెందిన ఆనంద నిలయంలో పెరటాసి శనివారం ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా చివరి రోజు ఆదివారం శ్రీ వెంకటేశ్వర భక్తసమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన శ్రీనివాస తిరుకల్యాణ వైభవాన్ని ఏర్పాటు చేశారు. పెరంబూరు ఆనంద వేలు వీధిలోని కల్కిరంగనాథన్ మాన్డ్‌ఫోర్ట్ హైయ్యర్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో ఉదయం తిరుమంజనం. కాశీయాత్ర, చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఊంజల సేవ భక్తిశ్రద్ధలతో చేశారు. 12.45 గంటలకు మాంగళ్యధారణ శాస్త్రోక్తంగా చేపట్టారు. గోవింద గోవిందా అంటూ గోవింద నామస్మరణతో పెరంబూరు ప్రాంతం మార్మోగింది. దాదాపు 3 వేలమందికి పైగా భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించి తరించారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు అందించి అన్నప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సమాజం సెక్రటరీ ఎస్ వెంకటరామన్, జాయింట్ సెక్రటరీ అనంతరామన్, కోశాధికారి కోదండరామయ్య ఇంకా వెంకటరమణుడు, రామచంద్రన్ , పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ తదితరులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరపున గరుడ వాహనంపై శ్రీ శ్రీనివాస పెరుమాల్‌ను ఊరేగించారు.

కమనీయం.. శ్రీనివాస తిరుకల్యాణం