
మూడు తరాల ప్రేమ కథగా అమరం
తమిళసినిమా: మూడు తరాల్లో మూడు ప్రాంతాల్లో జరిగే అమర్ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అమరం అని ఆ చిత్ర దర్శకుడు అరుళ్ కృష్ణన్ చెప్పారు. ఈయన దర్శకుడు గోకుల్, రాజన్ మాధవ్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. అరుళ్ కృష్ణన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని దివ్య క్షేత్ర ఫిలిమ్స్ పతాకంపై నిర్మల రాజన్ సమర్పణలో సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు. రాజన్ తేజేశ్వర్, ఐరా అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జార్జ్, సాయి దేనా, నాగినీడు, కల్కి రాజన్, హరీష్ పేరడీ, వాసుదేవన్ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మూడు తరాల్లో మూడు ప్రాంతాల్లో జరిగే అమరం సినిమా ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఎవరు చూడని సన్నివేశాలతో పూర్తిగా యాక్షన్ విందుగా ఉంటుందన్నారు. స్టంట్ మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఈ చిత్రం కోసం సరికొత్త యాక్షన్ సన్నివేశాలను రూపొందించారని చెప్పారు. ముఖ్యంగా క్‌లైమాక్స్ సన్నివేశాలను ప్రముఖ బాలీవుడ్ బృందం సహకారంతో రియలిస్టిక్ పోరాట దృశ్యాలను తెరకెక్కించారని చెప్పారు. ఈ చిత్రం కోసం నాలుగు పాటలను సంగీత ప్రియులను అలరించే విధంగా రూపొందించాలని చెప్పారు. చిత్రంలోని ఒక సన్నివేశాన్ని 5వేల అడుగుల ఎత్తులో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని తూర్పు అటవీ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చితంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి భరత్ కుమార్, గోపీనాథ్ ద్వయం ఛాయాగ్రహణం అందించారని, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ నటుడు శశి కుమార్ ఆవిష్కరించగా దీనికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని దర్శకుడు చెప్పారు.