
ధరణివరాహస్వామికి గరుడ సేవ
పళ్ళిపట్టు: ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవ శనివారం రాత్రి కమనీయంగా సాగింది. భారీసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపం ఎగువ పొదటూరులో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి, భూదేవి సమేత దరణి వరాహస్వామి ఆలయంలో పెరటాసి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకలు సందర్భంగా స్వామికి విశేష అభిషేక పూజలతో పాటూ ఆభరణాలతో అలంకరించి పూజలు చేస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో పెరటాని మూడవ శనివారంతో పాటు స్వామివారి గరుడ సేవ సందర్భంగా ఆలయంకు భక్తులు పోటెత్తారు. రెండు గంటల పాటూ భారీ క్యూలైన్‌లో వేచివుండి స్వామి దర్శనం చేశారు. రాత్రి పుష్పాలతో అలంకరించిన గరుడ వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవర్లు ధరణి వరాహస్వామి ప్రత్యేక అలంకరణలో కనువిందు చేశారు. భట్టాచార్యుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మహా దీపారాధనతో స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీగా వేచివున్న భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బాణసంచా వేడుకలు కేరళ చండీ మేళం నడుమ స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.