
షాపింగ్ సందడి
కొనుగోలుదారులతో కిటకిట జోరుగా మొదలైన దీపావళి వ్యాపారం జనసందోహంలో టీ నగర్ నిఘా పెంచిన పోలీసులు
సాక్షి, చైన్నె: నగరంలో దీపావళి పండుగ షాపింగ్ సందడి మొదలైంది. పండుగకు రెండు వారాలే సమయం ఉండడంతో జనం ఆదివారం షాపింగ్ మాల్స్ బాట పట్టారు. టీనగర్, పురసై వాక్కం, తాంబరంలలోని వస్త్ర దుకాణాలు కిట కిటలాడాయి. వివరాలు.. పండుగలు సమీపిస్తున్నాయంటే చాలు రాష్ట్ర రాజధాని నగరం జనంతో కళ కళలాడుతుంది. మాల్స్‌లో వ్యాపారం వేగం పుంజుకోవడం జరుగుతుంది. ఇక దీపావళి పండుగంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు, మిఠాయిలతో ఆనందాన్ని పంచుకునేందుకు సిద్ధం అవుతారు. దీపావళి పర్వదినానికి రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో షాపింగ్ సందడి మొదలైంది.
షాపింగ్ సందడి
పండుగను పురస్కరించుకుని ప్రతి రోజు సాయంత్రం వేళలల్లో జనం మాల్స్‌ల వైపు పోటెత్తు తుంటారు. శని, ఆదివారాలలో మరీ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు, పండుగకు అవసరమయ్యే వస్తువులు, బాణా సంచాల కొనుగోలు కోసం వాణిజ్య కేంద్రాలకు తరలుతున్నారు. నగరంలో వాణిజ్య కేంద్రాలుగా బాసిళ్లుతోన్న టీ నగర్, పురసై వాక్కం, ప్యారీస్, తాంబరం, క్రోంపేట తదితర ప్రాంతాల వైపుగా కదులుతోన్నారు. దీంతో ఆ పరిసరాలన్నీ కిట కిటలాడుతోన్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో టీనగర్‌కు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. అన్ని వస్త్ర దుకాణాలు జనంతో కిట కిటలాడాయి. దీపావళి వ్యాపారం జోరందుకునే అవకాశాలు ఈసారి ఎక్కువే. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో వాప్యారం బిజీలో మాల్స్ యజమానులు, వర్తలు నిమగ్నమయ్యారు. కొత్త కొత్త డిజైన్లను, వస్తువులను వినియోగ దారుల ముంగిట ఉంచుతున్నారు. అలాగే, ఆయా వస్త్ర దుకాణాలు పోటీలు పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
నిఘా కట్టు దిట్టం
టీ నగర్, రంగనాధం వీధి, పాండి బజార్, పురసై వాక్కం, డౌటన్, ప్యారీస్, ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డుల్లో నగర పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. టీ నగర్‌లో వెయ్యి మందిని రంగంలోకి దించారు. ఈ పరిసరాలలో 80 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. సెలవు రోజులలో అత్యధికంగా మఫ్టీ సిబ్బంది విధులలో నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. వాణిజ్య కేంద్రాలకు తరలి వస్తున్న జనాన్ని అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో నిఘా నేత్రాల్ని ఏర్పాటు చేసి, కంట్రోల్ రూం ద్వారా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బైనాకులర్‌లతో ఓ వైపు నిఘాను పర్యవేక్షిస్తూ, మరో వైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మైక్‌ల ద్వారా సిబ్బంది హెచ్చరిస్తూ వస్తున్నారు. నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ, ఆయా ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్ అరుణ్ పరిశీలించారు. అలాగే, తాంబరం, క్రోం పేట, వేళచ్చేరిలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, ఆవడి పరిసరాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై అక్కడి కమిషనరేట్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు దృష్టి పెట్టారు.