
సింహం అదృశ్యంతో కలకలం
సాక్షి, చైన్నె : బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మగ సింహం అదశ్యం కావడంతో వండలూరు జూ పరిసరాలలో కలకలం రేగింది. అయితే, ఈ సింహం జూలోనే ఉన్నట్టు, బయటకు వెళ్లేందుకు అవకాశం లేదని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె శివారులోని వండలూరులో అరింజ్ఞర్ అన్నా జులాజికల్ పార్కు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడికి నిత్యం సందర్శకులు తరలి వస్తున్నారు. ఇక్కడ లయన్ సఫారీ పార్కు కూడాఉంది. ఇందులో సింహాలు, పులులు బయటే తిరుగుతుంటాయి.సందర్శకులు ప్రత్యేక వాహనంలో వెళ్లి వీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఇటీవల బెంగళూరు నుంచి సేరు అన్న మగ సింహంను వండలూరు జూకు తీసుకొచ్చారు. దీనిని లయన్ సఫారీలో వదలి పెట్టారు. అయితే, శుక్రవారం నుంచి ఈ సింహం కనిపించడం లేదన్న సమాచారం టెన్షన్‌లోపడేసింది. ఆహారం కోసం రావాల్సిన సింహం రాలేదు. ఇతర సింహాలు, పులులు ఆహారంకోసం సంబంధిత ప్రాంతానికి వచ్చినా సేరు మాత్రం రాలేదు. సేరు సింహం అదృశ్యం సమాచారంతో వండలూరు చుట్టు పక్కల ఉన్న ఆలపాక్కం, కోలపాక్కం, నెడుగుండ్రం గ్రామాలలోని ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. సింహం వండలూరు జూ నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఈ గ్రామాల్లోకి చొరబడాల్సింది. ఆదివారం ఉదయాన్నే వెలువడ్డ సింహం అదృశ్య సమాచారంతో ఈ గ్రామాల ప్రజలలో ఆందోళన బయలు దేరింది. అయితే, సింహం వండలూరు జూ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లయన్ సఫారీ చుట్టూ ఎత్తయిన గోడలు, కంచె ఉన్నాయని, కంచెకు ముందు భాగంలో లోతైన ప్రదేశాల ఉండటంతో వీటిని దాటేందుకు పులులు, సింహాలు సాహసం చేయబోవని పేర్కొంటున్నారు. కొత్త ప్రదేశం కావడంతో ఈ సింహం ఎక్కడైనా పొదళ్లల్లో ఉండేందుకు వీలుందని , రెండురోజుల క్రితం కూడా ఆహారాన్ని పట్టుకు వెళ్లిందని, లయన్ సఫారీ అతి పెద్దది అని సింహం జూను వదలి బయటకు వెళ్లలేదని భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో ఈ సింహం కోసం లయన్ సఫారీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం గాలిస్తున్నారు.