
ఉప్పొంగిన కుశస్థలి
పళ్లిపట్టు: కుశస్థలి నదిలో వరద ప్రవాహంతో మూడు నేలమట్టం వంతెనలు నీట మునిగాయి. రవాణా సేవలు తెగడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో కృష్ణాపురం జలాశాయం పూర్తి సామర్థ్యంతో నిండింది. దీంతో జలాశయం నుంచి శనివారం రాత్రి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి పళ్లిపట్టు సమీపంలోని కుశస్థలి నదిలో వరద ప్రవాహం చోటుచేసుకుంది. రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు జలాశయం నుంచి మిగులు జలాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా కొండ చెరియల నుంచి వర్షపు నీరు కుశస్థలికి చేరుతున్న క్రమంలో వరద ప్రవాహం ఉప్పొంగింది. దీంతో కీయ్‌కాళ్‌పట్టడ, సామంతవాడ, నెడియం ప్రాంతాల్లోని నదికి మధ్యలోని నేలమట్టం వంతనెనలు పూర్తిగా మునిగాయి. అలాగే చెక్‌డ్యాంలలో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ధాటికి పళ్లిపట్టు ప్రాంతంలోని 20 నదీతీర గ్రామాల ప్రజలకు రవాణా సేవలు తెగాయి. పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు ప్రాంతాల్లో కుశస్థలి నది వరద ప్రవహించి పూండి చెరువుకు చేరుకుంటోంది. వరద ప్రవాహంతో నదీతీర ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉప్పొంగిన కుశస్థలి