
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పరిశీలన
తిరువళ్లూరు: చైన్నెలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులకు అవసరమైన ఫ్రీ–ప్యాబ్రీకేటెడ్ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు రహదార్లు శాఖ మంత్రి వేలు ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. వివరాలు.. చైన్నె అన్నాసాలై నుంచి తరచూ ఏర్పడుతున్న ట్రాపిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు తేనాంపేట నుంచి సైదాపేట వరకు సుమారు 3.20 కిమీ దూరం మేరకు 621 కోట్లు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫ్రీ–ప్యాబ్రీకెటెడ్ విధానంలో 16,300 టన్నుల బరువుతో ఫియర్, ఫియర్‌క్యాప్, గిర్డర్(వంతెనెల నిర్మాణానికి ఉపయోగించే పెద్ద ఇనుము) తదితర వాటిని ముంబాయిలోని ఎస్‌జీ ఇనుము పరిశ్రమ, గుజరాత్ వడదోరలోని కేపి గ్రీన్ పరిశ్రమ, తెలంగాణ రాష్ట్రం హైదరబాద్‌లోని ఐరన్ గ్లోబల్ పరిశ్రమ, చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని స్ట్రార్టక్ రైట్, తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని పెన్నార్ ఇనుము పరిశ్రమలో తయారు చేస్తున్నారు. ఈక్రమంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర రాష్ట్రాలో తయారవుతున్న పిల్లర్, పియర్‌క్యాప్, గిర్డర్ తయారీ పనులను మంత్రి వేలు అధికారులతో కలిసి గతంలో పరిశీలించి పనులను మరింత వేగంగా చేపట్టాలని సూచించడంతో పాటూ పనులను నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపాళ్యంలోని పెన్నార్(పీఐఎన్‌ఎన్) పరిశ్రమలో మంత్రి వేలు అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి వేలు మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని ఇనుము పరిశ్రమలో 1,436 టన్నుల సామర్థ్యంతో ఇనుప పిల్లర్‌లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని త్వరలోనే చైన్నెకు తరలించి ఫ్లైఓవర్లకు అమర్చునున్నట్టు వివరించారు. మంత్రి వెంట రహదార్లు శాఖ ప్రభుత్వ కార్యదర్శి సెల్వరాజ్‌తో పాటూ పలువురు అధికారులు ఉన్నారు.