
పెరియార్ ప్రపంచానికి నెల జీతం విరాళం
సాక్షి, చైన్నె : తిరుచ్చి సిరగనూరులో నిర్మిస్తున్న ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ ప్రపంచానికి సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు నెల రోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా మరైమలై నగర్‌లో ద్రావిడ కళగం నేతృత్వంలో స్వీయ మర్యాద మహానాడు శనివారం జరిగింది. డీఎంకే కూటమి పార్టీల నేతలందరూ ఈ మహానాడుకు తరలివచ్చారు. రాత్రి ద్రవిడ కళగం అధ్యక్షుడు వీరమణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ద్రవిడ కళగంకు వ్యతిరేకంగా డీఎంకే ఆవిర్భవించ లేదని,పెరియార్ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, బలోపేతానికి ఆవిర్భవించినట్టు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పెరియార్‌ను చెప్పులు, బూట్లు, కత్తులు, ఆయుధాలతో సైతం కొట్టారని గుర్తు చేస్తూ, నేడు ఆ మహనీయుడి సిద్ధాంతాలు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వరకు చేరినట్టు వివరించారు. ప్రాణం ఉన్నంత కాలం స్వీయ మర్యాదను వదులుకోమని, తమిళుల రక్షణే లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. 92 సంవత్సరాల వయస్సులోనూ వీరమణి శ్రమిస్తున్నారని గుర్తుచేస్తూ, తమ లాంటి వాళ్లు కూడా సేవ చేయడానికి ఉన్నామని, పని భారం తగ్గించుకోవాలని సూచించారు. ద్రవిడ సిద్ధాంతానికి రాజకీయ వేదికగా ఉన్న డీఎంకే ప్రపంచ వ్యాప్తంగా పెరియార్ ఘనత చాటే విధంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. తిరుచ్చి సిరగనూరులో ద్రవిడ కళగం నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న పెరియార్ ఉళగం (పెరియార్ ప్రపంచం) పనులకు తనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. 2026 ఎన్నికలు తమిళుల ఆత్మగౌరవానికి సంబంఽధించినదని, ఇందులో విజయం సాధిస్తామని, తమిళుల్ని తలెత్తుకునేలా మళ్లీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పెరియార్ ప్రపంచానికి నెల జీతం విరాళం