
అవయవదానానికి ముందుకు రావాలి
వేలూరు: అవయవాలు దానం చేసేందుకు అవగాహన కలిగి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సినీ డైరెక్టర్ వెంకట్‌ప్రభు అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి పీఠాధిపతి శక్తి అమ్మ ఆశీస్సులతో నడుస్తున్న నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశిష్ట సేవలు అందజేసిన డాక్టర్‌లకు వైద్యసిబ్బందికి అవార్డుల పంపిణీ కార్యక్రమం ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. మనం తీసుకునే ఆహారం వల్లే అధికంగా గుండెపోటు వస్తుందని వీటిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండడంతోపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల కాలంలో అధికంగా గుండెపోటుతోనే మృతి చెందుతున్నారని వీటిపై వైద్యులు పరిశోధనలు చేసి తగిన మందులను కనుగొనాలన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ నారాయణి ఆస్పత్రిలో నిరుపేద రోగులకు అతితక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. సిబ్బంది సేవాభావాన్ని అలవాటు చేసుకొని రోగులతో ప్రేమగా నడుచుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే శక్తిఅమ్మ ఈ ఆస్పత్రిని ప్రారంభించారన్నారు. నటి మిర్‌నాలిని రవి, నారాయణి ఆస్పత్రి, పరిశోధన కేంద్రం సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.