
యానిమేషన్ చిత్రం కీకీ–కోకో
తమిళసినిమా: యానిమేషన్ కథా చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడి చూస్తారు. అలా తాజాగా పిల్లల నుంచి పెద్దలు వరకు చూసి ఆనందించే విధంగా రూపొందిన యానిమేషన్ చిత్రం కీకీ–కోకో. ఇనికా ప్రొడక్షన్‌న్స్ రూపొందించిన ఈ చిత్రానికి నారాయణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కీకీ–కోకో చిత్రం మాత్రమే కాదని, అంతకు మించి స్నేహం, ప్రేమ వంటి అంశాలతో కథను చెప్పిన విధానం పిల్లలను ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా వినోదంతో పాటు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చక్కని అనుభూతిని కలిగించే ఈ మ్యాజిక్ చిత్రాన్ని చూడడానికి అందరూ థియేటర్లకు రావాలన్నారు. చిత్ర దర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ అన్నింటి కంటే పిల్లలకు విద్యకు సంబంధించిన కథా చిత్రాలే చాలా అవసరం అన్నారు. అలా కీకీ–కోకో చిత్రం విద్య అవసరం గురించి చర్చించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. కీకీ అంటే అందమైన ప్రాణి. కోకో అంటే యువతి అని చెప్పారు. అలా వారి మధ్య సాగే అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రేమ, స్నేహం వంటి విషయాలను నేర్చుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకునే విధంగా కీకీ–కోకో చిత్రం ఉంటుందని పేర్కొన్నారు.
కీకీ–కోకో చిత్రంలో ఓ సన్నివేశం