
నలం కాక్కుం స్టాలిన్ కొనసాగించడం ఖాయం
వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తునన నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగించడం ఖాయమని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని సేర్‌కాడులోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రోగుల వద్ద వసతులపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌లు, వైద్య సిబ్బంది తరచూ వస్తున్నారా? లేదా? అనే విషయాలను రోగుల వద్ద అడిగారు. అనంతరం దివ్యాంగులకు సర్టిఫికెట్లుతో పాటూ వివిధ ఆపరేషన్‌ల కోసం సిపార్సు అనుమతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నందున అవసరమైన ముందస్తు జాగ్రత్తలను రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నలం కాక్కుం స్టాలిన్ పథకాన్ని రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించి రోగులకు అవసరమైన చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కరూరు సంఘటనపై విలేకరులు ప్రశ్నించగా వీటి గురించి విచారణ కమిషన్ విచారణ జరిపి కోర్టు తీర్పు ఇస్తుందని వీటి గురించి మనం ఏం మాట్లాడబోమన్నారు. కరూరు ఘటనపై డీఎంకేపై ప్రతి పక్ష పార్టీలకు చెందిన కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని వీటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. కార్యక్రమంలో కాట్పాడి యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, డీఎంకే పార్టీ ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.