40 ఏళ్ల తర్వాత అడయారుకు విదేశీ పక్షులు | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల తర్వాత అడయారుకు విదేశీ పక్షులు

Oct 5 2025 4:56 AM | Updated on Oct 5 2025 4:56 AM

40 ఏళ్ల తర్వాత అడయారుకు విదేశీ పక్షులు

40 ఏళ్ల తర్వాత అడయారుకు విదేశీ పక్షులు

● పెద్దల కోసం వ్యాయామశాల ● అమిత్‌ షాతో భేటీ ● పార్టీ వర్గాలకు నైనార్‌ సమాలోచన

తిరువొత్తియూరు: అడయారు నది ముఖద్వారం వద్ద సుమారు 40 ఏళ్ల తర్వాత సిప్పి పిడిప్పాన్‌, సాండర్స్‌ ఆలా వంటి అరుదైన విదేశీ పక్షులు మళ్లీ కనిపించాయి. ఇది చైన్నె తీర ప్రాంత పర్యావరణం మెరుగుపడుతోందనేందుకు ఈ పరిణామం ఓ ముఖ్యమైన సూచనగా పరిగణించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అరుదైన అతిథుల రాకతో పక్షి ప్రేమికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో మరో 25 లక్షల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

కొరుక్కుపేట: ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, మే 1, 2016న ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, పేద మహిళలను ఎంపిక చేసి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గ్యాస్‌ స్టవ్‌, డిపాజిట్‌ మొత్తం, రబ్బరు పైపు, రెగ్యులేటర్‌ , మొదటి సిలిండర్‌ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సిలిండర్‌ కొనుగోలుకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఈ పథకం కింద తమిళనాడులో 40 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇప్పటికే అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో 25 లక్షల కొత్త ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించాలని నిర్ణయించింది. ఈ అంశంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ కొత్తగా అందించనున్న 25 లక్షల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లలో, ప్రతి రాష్ట్రానికి ఎన్ని కనెక్షన్లు కేటాయిస్తారనే విషయంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు.

మెరీనాలో చిల్డ్రన్స్‌ పార్కు

ఏర్పాటుకు సిద్ధం

తిరువొత్తియూరు: పర్యాటకులను ఆకర్షించడానికి అన్నాదురై సమాధి సమీపంలో మెరీనా బీచ్‌లో బీచ్‌ను పునరుద్ధరిస్తున్నట్లు, ఇందులో భాగంగా అన్నాసమాధి సమీపంలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని చైన్నె కార్పొరేషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. రూ.64 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్కులో పిల్లల కోసం స్కేటింగ్‌ రింక్‌, ఊయల, స్లైడ్‌ వంటి ఆటలకు సౌకర్యాలు కల్పించనున్నారు. అదేవిధంగా, రూ. కోటి వ్యయంతో పెద్దల కోసం వ్యాయామశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ బీచ్‌ పునరుద్ధరణతో బీచ్‌కు వచ్చే ప్రజలు కొంత భాగాన్ని వినోదం, ఆటల సౌకర్యాల వైపు మళ్లించవచ్చు. దీని ద్వారా అక్రమంగా ఏర్పాటు చేసే దుకాణాలు తగ్గుతాయని కార్పొరేషన్‌ కమిషనర్‌ కుమరగురుబరన్‌ తెలిపారు. బీచ్‌ చుట్టుపక్కల ఉన్న 100కు పైగా అనుమతి లేని దుకాణాలను తొలగించనున్నట్లు, కార్పొరేషన్‌ తరపున బ్యాడ్మింటన్‌ కోర్టులు, వ్యాయామం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

మళ్లీ బాంబు బూచి

సాక్షి, చైన్నె: బాంబు బూచీలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా వస్తున్న ఈ బెదిరింపు వెనుక ఉన్న అదృశ్య శక్తులను గుర్తించడం సైబర్‌ క్రైం వర్గాలకు సైతం సవాలుగా మారింది. ఇప్పటికే వరసుగా వచ్చిన బెదిరింపులతో భద్రతను ఆయా ప్రాంతాలలో కట్టుదిట్టంచేశారు. తాజాగా డీఎంకే ఎంపీ కనిమొళి, మాజీ సీఎస్‌ వైద్యనాథన్‌, మాజీ డీజీపీ నటరాజ్‌తోపాటూ ఏడుగురిని టార్గెట్‌ చేస్తూ వచ్చిన బెదిరింపు మెయిల్‌తో ఆయా ప్రాంతాలలో శనివారం బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. ఆయా ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రోజుకో బెదిరింపు ఈ మెయిల్స్‌ వస్తుండటం, వీటిని పంపిస్తున్న వాడు ఐడీలు మారుస్తుండటం వంటి అంశాలతో గుర్తించడం కష్టతరంగా మారినట్టు సైబర్‌ క్రైం వర్గాలు పేర్కొంటున్నాయి.

ఢిల్లీకి అన్నామలై

సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై హుటాహుటిన శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆయ న సమావేశం నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్టు మద్దతు దారులు పేర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు నైనార్‌ నాగేంద్ర, ఇతర నాయకులు ఎవ్వరూ లేకుండా అన్నామలై మాత్రమే ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీసింది. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాల కార్యదర్శులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ చైన్నెలో సమావేశం కావడం గమనార్హం. అన్నామలై ఢిల్లీ పయనం అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు జరుగుతున్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, విజయ్‌ పార్టీ వర్గాల చుట్టూ బిగుస్తున్న కరూర్‌ ఘోర ఘటన కేసులు వంటి అంశాలను ఢిల్లీ పెద్దల దృష్టికి అన్నామలై తీసుకెళ్లబోతున్నట్టు పేర్కొంటున్నారు. విజయ్‌కు అభయం ఇచ్చే విధంగా ఢిల్లీలో వ్యూహ రచన జరగవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement