
కోస్టుగార్డుకు అక్షర్ అంకితం
సాక్షి, చైన్నె : భారత కోస్టు గార్డు అమ్ముల పొదిలోకి అక్షర్ పేరిట కొత్తనౌక ప్రవేశించింది. పుదుచ్చేరిలోని కారైక్కాల్ సముద్ర తీరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నౌకను గస్తీ నిమిత్తం రంగంలోకి దించారు. రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఐడీఎఎస్ దీప్తి మోహిల్ చావ్లా, కోస్టు గార్డు తూర్పు సముద్ర తీరం కమాండర్, అదనపు డైరెక్టర్ జనరల్ డోనీ మైఖెల్ ఈ నౌకకు జెండా ఊపారు. దీనిని దేశ సముద్ర భద్రతా సామర్థ్యాలకు అనుగుణంగా 51 మీటర్ల ఫాస్ట్ పెట్రోల్ నౌకగా స్వదేశీ పరిజ్ఞానంలో తీర్చిదిదిద్దారు. గోవా షిప్ యార్డ్‌లో ఇది రూపుదిద్దుకుంది. దీనికి అక్షర్ అని నామకరణం చేశారు. ఇది 60 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్‌తో ఆత్మ నిర్భర్ భారత్‌కు ఉదాహరణగా పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో సముద్ర శక్తిని బలోపేతం చేయడానికి ఇది దోహదకరంగా ప్రకటించారు. ఈ నౌక సుమారు 320 టన్నుల బరువు కలిగి ఉంది. 3000 కే డబ్ల్యూతో రెండు డీజిల్ ఇంజిన్ ద్వారా నడపబడుతుంది. ఇది గరిష్టంగా 27 నాట్స్ వేగాన్ని అందుకుంటుంది.ఇందులో 30 ఎంఎం సీఆర్‌ఎన్ –91 గన్, 12.7 ఎంఎం స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గన్‌లు కూడా ఉన్నాయి. ఇది పుదుచ్చేరిలోని కారైక్కాల్ కేంద్రంగా ఉంటుంది. ఈనౌక కమాండెంట్‌గా శుబేందు చక్రవర్తి నాయకత్వం వహిస్తారు. అలాగే ఐదుగురు అధికారులు 33 మంది సిబ్బంది ఇందులో ఉంటారు.

కోస్టుగార్డుకు అక్షర్ అంకితం