
పళనికి చిక్కులు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్య యాత్రకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఆయన రోడ్ షోలకు అనుమతులు నిరాకరిస్తూ అనేక జిల్లాల పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. వివరాలు.. తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దాం అన్న నినాదంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్యయాత్రను కొన్ని నెలల క్రితం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన నాలుగో విడత ప్రచారం ముగించి, ఐదో విడత ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితులలో ఆయన ప్రచారాలకు తాజాగా అనుమతులు రద్దు అవుతున్నాయి. కరూర్ ఘటన నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు, పరిసరాలలో ప్రచార సభలకు అనుమతులను హైకోర్టు శుక్రవారం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం పళనికి సైతం చిక్కులను సృష్టిస్తోంది. ఈరోడ్ తిరుచంగోడు, నామక్కల్ కుమార పాళయం, పోతనూరు తదితర ప్రాంతాలలో ఆయన రోడ్ షోలకు ముందుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా అనుమతుల కోసం ఆయా జిల్లాల ఎస్పీలను ఆశ్రయించగా, ఇంత వరకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇతర ప్రాంతాలను వేదికగా ఎంపిక చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాని విధంగా స్థలాలను ఎంపిక చేసి దరఖాస్తులు చేసుకోవాలని అన్నాడీఎంకే వర్గాలకు పోలీసులు సూచించడం గమనార్హం. ఈ పరిస్థితులో శనివారం పళణి స్వామి పెన్నగరంలో తన ప్రచార పర్యటనను రైతులు, వివిధ సంఘాలతో సమావేశాల రూపంలో నిర్వహించాల్సి వచ్చింది.