
ఘనంగా ధ్వజారోహణం
– పురటాసి పండుగ ప్రారంభం
–12వ తేదీన రథోత్సవం
కొరుక్కుపేట: మనలి పుదునగర్‌లోని అయ్య వైకుంఠ ధర్మపతి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో పురటాసి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూలతో అలంకరించిన పవిత్ర జెండాను మోసుకెళ్లిన భక్తులు అయ్యల హరోహర శివ నామాన్ని జపిస్తూ, పాఠశాల హాలు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసి, ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జెండా ఎగురవేశారు. పండుగ రోజుల్లో, అయ్యవారి పాగలం పఠనం జరుగుతుంది. ప్రతి రోజు సాయంత్రం ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ నెల 12 న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు వెల్లడించారు.
యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: యువతిని మోసం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె ముఖప్పేర్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి ఇస్ట్రాగామ్ ద్వారా ఆదిత్యన్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అతను ఆ యువతికి మాయ మాటలు చెప్పి, తాను నిన్ను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆ యువతి, ఆదిత్యన్‌తో వివాహేతర సంబంధం నడిపింది. ఈ పరిస్థితిలో ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతి, ఆదిత్యన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే డిసెంబర్ ఒకటో తేదీ వివాహం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత నెలలో ఆదిత్యన్ తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు కట్నంగా అడిగారు. ఈ విషయం గురించి ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం 50 సవర్లు ఇవ్వలేమని చెప్పడం కోసం ఆదిత్యన్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆదిత్యన్, అతని తల్లిదండ్రులు అసభ్యకరమైన మాటలతో మాట్లాడి, పెళ్లి చేసుకోడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి యువతి తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్యన్ ను అరెస్టు చేశారు.
మౌలిక వసతుల కోసం రాస్తారోకో
తిరువళ్లూరు: కాకలూరులోని నాలుగో వార్డులో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు రాస్తారోకో చేపట్టారు. దీంతో దాదాపు గంట పాటు ట్రాపిక్‌కు అంతరాయం కలిగింది. తిరువళ్లూరు జిల్లా కాకలూరు పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, వీధిఽ దీపాలు, మురికి నీటి కాలువ, తాగునీటి కొళాయి తదితర వసతులు కల్పించాలని పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన నాలుగో వార్డు వాసులు రోడ్డురోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాలను కల్పించే విషయంపై ఉన్నతాఽధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హమీ మేరకు ఆందోళన విరమించారు.