
తాగునీటి కోసం ఆందోళన
తిరుత్తణి: తాగునీటి కోసం మహిళలు రాస్తారోకో చేశారు. తిరువలంగాడు యూనియన్‌లోని తాళవేడు పంచాయతీలోని అరుంధతీ కాలనీలో 30 కుటుంబాలు నివాసమున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామీణులకు తాగునీరు సరఫరా చేసేవారు. అయితే రెండు నెలలుగా రెండు కిలో మీటర్ల దూరంలోని తాళవేడు పంట పొలాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుండడంతో అరుంధతీకాలనీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ సిబ్బందికి పలుసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన మహిళలు 30 మంది ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. నల్లాట్టూరు రోడ్డులో బైఠాయించి, నిరసన తెలిపారు. గంట పాటు మహిళలు ఆందోళన చేసినా అధికారులు రాకపోవడంతో మహిళలు నిరాశతో వెనుతిరిగారు.