
షార్ట్ సర్క్యూట్‌తో ట్రక్కులో మంటలు
సేలం: చక్కెర తరలిస్తున్న ట్రక్కులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి. కర్ణాటకలోని మైసూర్ నుంచి 35 టన్నుల చక్కెరతో ట్రక్కు సేలం జిల్లాలోని బర్గూర్ పర్వత రహదారి మీదుగా తంజావూరుకు బయలుదేరింది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో, తామరైకరై పక్కన ఉన్న పర్వత రహదారి మొదటి హెయిర్‌పిన్ మలుపు వద్దకు ట్రక్కు చేరుకున్నప్పుడు, ఇంజిన్‌లో షార్ట్ సక్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ట్రక్కు డ్రైవర్, సహాయకుడు వెంటనే ట్రక్కు నుంచి దిగి నీరు పోసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ దారిన వెళుతున్న వాహనచోదకులు వెంటనే అంతియూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. పర్వత ప్రాంతం కావడంతో అగ్నిమాపక వాహనం రావడానికి అరగంట ఆలస్యం అయింది. అప్పటికి ట్రక్కు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది దానిపై నీరు చల్లడం ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల వేడికి ట్రక్కులోని చక్కెర కరిగి రోడ్డుపైకి ప్రవహించింది. దీంతో పర్వత రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. చక్కెర సిరప్ తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలను అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.