
ఎందుకీ వివక్ష!
సాక్షి, చైన్నె: తమిళనాడు, తమిళ ప్రజలు భారత దేశంలో లేదా వీరు భారతీయులు కారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రామనాథపురంలో ప్రగతి పనులకు శుక్రవారం సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం రామనాథపురంలో పర్యటించారు. ఇక్కడ జరిగిన ప్రభుత్వ కార్యాలయంలో రూ.176 కోట్లతో పూర్తి చేసిన పనులు, రూ.132 కోట్లతో చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.426 కోట్ల 83 లక్షలతో 50,752 మంది లబ్ధిదారులకు సంక్షేమాలు అందించారు. మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, మంత్రి తంగం తెన్నరసు, కేఆర్.పెరియకరుప్పన్, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, పార్లమెంటు సభ్యుడు నవాజ్‌ఖని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కేంద్రంతో ఒరిగిందేమీ లేదు
శ్రీలంక నౌకాదళం దాడిలో ముందుగా గాయపడేది ఇక్కడి జాలర్లే అని ఆవేదన వ్యక్తం చేస్తూ, వీరిని రక్షించేందుకు, భద్రత కల్పించే విధంగా చర్యలకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. పదే పదే తాము విజ్ఞప్తి చేస్తున్నా, కచ్చదీవుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమిళనాడు భారతదేశంలో లేదా, తమిళ జాలర్లు భారతీయులు కాదా? అని ఈసందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమిళులపై బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు అంత కోపం, వివక్ష అని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలు, విధానాల రూపంలో జీఎస్టీ రూపంలో పన్నులను కోల్పోయామని, ఇందులోనూ వాటాగానీ, ఇతర పథకాలకు నిధులు గానీ సక్రమంలో ఇవ్వడం లేన్నారు. తమిళనాడును కేంద్రంలోని బీజేపీ పాలకులే కాదు, ఇక్కడి ఆ పార్టీ నాయకులు సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో తమిళనాడు మూడు ప్రధాన విపత్తులను ఎదుర్కొందని, వేలాదిమంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారని వివరించారు. అప్పుడు తమిళనాడుకు రాని కేంద్ర ఆర్థిక మంత్రి, ఇప్పుడు కరూర్ ఘటనకు పరామర్శ అంటూ పరుగులు తీశారని విమర్శించారు. మణిపూర్ అల్లర్లు,గుజరాత్ ప్రమాదాలు, కుంభమేళాలో జరిగిన ఘటనల గురించి నిజనిర్ధారణ కమిటీ వేయని ఈ బీజేపీ వాళ్లు, ఇప్పుడు ఓ కమిటీ వేయడం, వాళ్లు కరూర్‌కు వచ్చి వెళ్లడం వంటి అంశాలను ప్రజలు గుర్తించాలని సూచించారు. బీజేపీ రాష్ట్రాల రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం ధ్యేయంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే బీజేపీకి బానిసగా ఈ రాష్ట్రంలో మారిందని, ప్రజాప్రయోజనాలను విస్మరించి, స్వప్ర యోజనాల కోసం ఆ పార్టీ వర్గాలు పరుగులు తీస్తున్నారని విమర్శించారు. వీరి రాజకీయ కుట్రలను తిప్పికొట్టి, తమిళనాడును, తమిళ ప్రజలను రక్షించడమే ధ్యేయంగా తాను ముందు నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ద్రవిడ మోడల్ పాలన కొనసాగుతుందని, 2.ఓ పాలన విభిన్నంగా ఉంటుందన్నారు. అనంతరం ీస్టాలిన్ కీలడికి వెళ్లారు. అక్కడ పురావస్తు తవ్వకాలను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
సామరస్యం రాజ్యమేలే భూమి
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఎంతో సుందరంగా కనిపించే రామనాథపురం సముద్ర తీరం గురించి ప్ర స్తావించారు. అన్ని మతాలు, వర్గాల ప్రజల సామ రస్యం రాజ్యమేలే భూమి ఇది అని వ్యాఖ్యానించారు. రామనాథపురంలో రూ.616 కోట్లతో కావేరి ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామన్నారు. రామనాథపురం బస్టాండ్, తంగచ్చి మఠం ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల భవనం, కోవిలాంగులంలో, పరమకుడిలో సామాజిక న్యాయ హాస్టల్ ప్రారంభించామన్నారు. రామనాథపురంలో చేపట్టనున్న తొమ్మిది కొత్త ప్రాజెక్టులకు సంబంఽధించి ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్‌లు త్వరలో అమల్లోకి వస్తాయన్నారు.

ఎందుకీ వివక్ష!