
సిట్‌కు కరూర్ ఘోరం
సీబీఐ విచారణ కోరిన పిటిషన్లు తిరస్కృతి భుస్సీఆనంద్, నిర్మల్‌కుమార్ బెయిల్ పిటిషన్ కూడా కోర్టును రాజకీయ వేదికగా మార్చకండి
సాక్షి, చైన్నె: కరూర్ ఘోర ఘటనను ప్రత్యేక సిట్‌కు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నార్త్ జోన్ ఐజీ అష్రాకార్గ్ ఐపీఎస్‌ను విచారణ అధికారిగా నియమించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. టీవీకే నేతలు భుస్సీఆనంద్, నిర్మల్‌కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించబడడంతో వారిని అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు.
కరూర్‌లో తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈకేసును కరూర్ పోలీసులు విచారిస్తున్నారు. అదేసమయంలో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో టీవీకేతో పాటు పలువురు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు వేశారు. తొమ్మిది పిటిషన్లు దాఖలైనట్టు సమాచారం. ఈ పిటిషన్లపై మదురై ధర్మాసనం బెంచ్ న్యాయమూర్తులు విచారణ జరిపారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలా సీబీఐ విచారణను కోరుతారని పిటిషనర్లను న్యాయమూర్తులు కోరారు. కేసు విచారణలో సంతృప్తి లేనప్పుడు సీబీఐ విచారణకు ఆశ్రయించవచ్చని, కేసే ప్రాథమిక దశలో ఉండడాన్ని పరిగణిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో పిటిషన్లు దాఖలు చేసిన వారు బాధితులా అని ప్రశ్నిస్తూ ఒక్కసారి బాధిత కుటుంబాలను చూడండి అని వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐ విచారణకు కోరుతూ దాఖలైన పిటిషన్లన్నీ తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, నిర్మల్‌కుమార్‌ల ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సమయంలో కరూర్ ఘటన ప్రమాదం అంటూ భుస్సీఆనంద్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించడం గమనార్హం. వాదనల అనంతరం తీర్పును న్యాయమూర్తులు రిజర్వులో పెట్టారు. మధ్యాహ్నం తర్వాత వీరికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ, పిటిషన్లు తిరస్కరించారు. అలాగే, నామక్కల్ టీవీకే జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు. దీంతో భుస్సీఆనంద్, నిర్మల్‌కుమార్‌లను అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మదురై ధర్మాసనంలో సాగిన పిటిషన్ల వాదనల సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. కోర్టును రాజకీయ వేదికగా మార్చకండి అని హితవు పలికారు.
విచారణ అధికారిగా అష్రాకార్గ్
సిట్‌కు అప్పగింత
సభలు, సమావేశాల నిర్వహణకు వేదికల ఎంపికకు మార్గదర్శకాలను రూపకల్పన చేయాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు స్పందిస్తూ, కరూర్ ఘటనపై విజయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు కనిపించడం లేదన్న అసంతృప్తిని జడ్జిలు వ్యక్తం చేశారు. ఘటన తర్వాత టీవీకే నిర్వాహకులు అంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుందని అసహనం వ్యక్తం చేశారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, ఆ పరిసరాలలో రాజకీయపక్షాల బహిరంగ సభలు, సమావేశాలు, మహానాడుకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. ప్రస్తుతం ఎవరైనా అనుమతి పొంది ఉంటే జరుపుకోవచ్చని, ఇక అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, సభలు, సమావేశాలు, మహానాడుల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. చివరకుగా ఈ కేసును సిట్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ జోన్ ఐజీ అష్రాకార్గ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయనకు కేసుకు సంబంఽధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని కరూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే, టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున వివాదాస్పద ట్విట్ గురించి సైతం కేసు విచారణకు వచ్చింది. ఆయన ట్వీట్‌ను పరిగణించిన కోర్టు ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం. చట్టపూర్వక చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించడంతో ఆదవ్‌ను సైతం అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.