
తగ్గని బాంబు బూచీలు
– సీఎం, నటి త్రిష ఇంటికి బెదిరింపు
సాక్షి, చైన్నె : బాంబు బూచీలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. శుక్రవారం సీఎం స్టాలిన్, నటి త్రిషతో పాటు పలువురి ఇళ్లల్లో బాంబులు పేలుతాయంటూ బెదిరింపుల మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఇటీవల కాలంగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌కాల్ లేదా ఈ మెయిల్ బెదిరింపు రావడంతో పోలీసులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇన్నాళ్లు చైన్నె విమానాశ్రయం, చైన్నెలోని విద్యా సంస్థలకు అధికంగా బాంబు బెదిరింపులు వచ్చేవి. ఈ పరిస్థితుల్లో గత పది రోజులుగా అధికారులు, రాజకీయనాయకుల పేరిట సైతం బాంబు బూచీలు పెరిగాయి. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, డిప్యూటీ సీఎం స్టాలిన్ పేర్లతో సైతం హెచ్చరికల ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇక, సీఎం స్టాలిన్ నివాసానికి సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరికలు చేయడం, అతడిని పోలీసులు గురిపెట్టడం జరిగాయి. మదురైలో ఐటీ మంత్రి పళణివేల్ త్యాగరాజన్‌ను టార్గెట్ చేసినట్టుగా కూడా బెదిరింపులు గత రెండు, మూడు రోజులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఏకంగా పది చోట్ల బాంబులు ఉన్నట్టుగా వచ్చిన బెదిరింపు చైన్నె పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. తేనాంపేటలోని ఆడిట్ జనరల్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు మెయిల్‌తో పోలీసులు పరుగులు తీశారు. చైన్నెలో మొత్తం పది చోట్ల బాంబులు ఉన్నట్టుగా వచ్చిన హెచ్చరికలతో పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి సోదాలు నిర్వహించి బూచీగా తేల్చారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సైతం బాంబులు ఉన్నట్టుగా కంట్రోల్ రూమ్‌కు వచ్చిన బెదిరింపుతో అక్కడ కూడా సోదాలు చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ నివాసం, పరిసరాల్లో బాంబులు పెట్టినట్టుగా, నటి త్రిష ఇంట్లోనూ బాంబు పెట్టినట్టుగా వచ్చిన బెదిరింపు మెయిల్‌తో ఉదయాన్నే పోలీసులు పరుగులు తీశారు. అన్నిచోట్ల క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇది బెదిరింపు బూచీ అని తేల్చారు. అయితే, ఈ బూచీలు ఇస్తున్న వారెవ్వరో అన్నది తేలడం లేదు. వీరిని గుర్తించేందుకు సైబర్ క్రైం వర్గాలు తీవ్రంగా కుస్తీ పడుతున్నాయి. సీఎం, త్రిష ఇంటి పరిసరాలలో తనిఖీలు ముగియగానే, విమానాశ్రయంలో బాంబులు ఉన్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.