
ఎన్‌ఎల్‌సీ సీఎండీకి అవార్డు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లిని మహాత్మా అవార్డు వరించింది. వ్యాపారం, స్థిరత్వంసామాజిక ప్రభావంలో నాయకత్వం, వ్యక్తిగత విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు–2025ను ఢిల్లీలో ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రిటైర్ట్ మహిళా ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీతోపాటు ఇతర ప్రముఖులు ఈ జీవిత సాఫల్య సాధన, వ్యాపార నాయకత్వ అవార్డును ప్రసన్నకుమార్‌కు ప్రదానం చేశారు. మహాత్మా అవార్డును ప్రముఖ సీఎస్‌ఆర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన అమిత్ సచ్‌దేవా–2016లో ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతుతో స్థాపించారు. సమాజ మార్పనకు కృషి చేసే వారిని, సంస్థలకు ప్రదానం చేసే ఈ అవార్డు ప్రపంచంలోనే అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా గుర్తించబడింది. జాతిపిత గాంధీ గౌరవార్థం ఈ అవార్డు సత్యంఅహింస, సామాజిక న్యాయం, సమానత్వం, కరుణ, స్థిరత్వం అనే విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంస్థలు సహా 500 మందిని ఇప్పటివరకు ఈ అవార్డుతో సత్కరించారు. 2025 మహాత్మా అవార్డుకు జ్యూరీ మూల్యాంకన ప్రక్రియ మేరకు మోటుపల్లిని ఎంపిక చేశారు. ఎన్‌ఎల్‌సీ ఇండియా స్థిరమైన, సమగ్ర వృద్ధి వైపు నడిపించడంలో ఆయన దార్శనిక నాయకత్వానికి ఈ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మహాత్మా అవార్డు తనకు దక్కడం ఎంతో గౌరవంగా పేర్కొన్నారు. ఈ గుర్తింపు ఎన్‌ఎల్‌సీ ఇండియా బృందానికి చెందుతుందన్నారు.