
ఇంటి పట్టాలు కేటాయించాలని ఆందోళన
అఖిల భారత కిషాన్ సంఘం మహాధర్నా
తిరువళ్లూరు: అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసం వుంటున్న వారికి, ఇంటి స్థలాలు లేని వారికి కొత్త స్థలం కేటాయించి పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వందలాది మంది మంగళవారం ఉదయం తిరువళ్లూరులో ఆందోళన చేశారు. ధర్నా ఆందోళనలో అఖిల భారత కిషాన్ సంఘం జిల్లా కన్వీనర్ సంపత్ అధ్యక్షత వహించారు. సంపత్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా పరిధిలోని పుదుపేటై, జీఆర్ కండ్రిగ, మేల్‌ముదలాంబేడు, అప్పావరం, స్వామిరెడ్డి కండ్రి, పొన్నేరి తాలుకా పరిధిలోని చోళిపాళ్యం, ఆరణి, అత్తికుళం, నల్లారు, చిన్నంబేడు, ముస్లింనగర్ ఆవడి తాలుకా పరిధిలోని బమ్మాత్తుకుళం, కన్నిమానగర్, తిరునిండ్రవూర్‌లోని ధర్మరాజ కోవిల్ వీధి తిరువళ్లూరు తాలుకా పరిధిలోని కొమక్కంబేడు, తామరపాక్కం, చెంబేడు, కొడువెళి, ఊత్తుకోట తాలుకా పరిధిలోని మెయ్యూరు, తిరుకండలం, తామరకుప్పంతో ఆర్కేపేట, పళ్లిపట్టు, తిరుత్తణి తాలుకా పరిధిలోని గ్రామాలకు చెందిన అర్హులకు పట్టాలను వెంటనే మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఇప్పటికే అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో నివాసం వున్న వారికి పట్టాలు ఇవ్వడం, ఇంటి స్థలం లేని వారికి వెంటనే పట్టాలను ఇవ్వాలని సూచించారు. సంఘం నేత తమిళరసు పాల్గొన్నారు.