
కొనసాగుతున్న అరుణాజగదీషన్ విచారణ
నీరసించిన జనం..
ఊపిరి ఆడకే మరణాలు
హెచ్చరించినా ఖాతరు చేయ్యని భుస్సీ ఆనంద్
రోడ్ షో.. రాంగ్ రూట్
కొంప ముంచాయ్
పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు నమోదు
విచారణ అధికారిగా ప్రేమానంద్
సాక్షి, చైన్నె : కరూర్‌లో తమిళగ వెట్రికళగం (టీవీకే ) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న సుగుణ అనే మహిళ మరణించారు. ఆస్పత్రి మార్చురీలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మినహా తక్కిన వారందరి మృతదేహాలను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏలురు పుదుర్ గ్రామానికి చెందిన ఐదుగురు మరణించడంతో అందరి మృతదేహాలను ఒకే చోట ఖననం చేశారు. విశ్వనాథపురిలో తల్లి, ఇద్దరు బిడ్డలు మరణించడంతో వీరి మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఆస్పత్రిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారందరూ కోలుకున్నట్టే అని వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో సంఘటన జరిగిన రోజు రాత్రికి రాత్రే మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహణపై అనుమానాలు సైతం వ్యక్తం చేసే వారు పెరిగారు. రాత్రులలో పోస్టుమార్టం చేయడానికి వీలు లేనప్పడు ఎలా చేస్తారని ప్రశ్నించే వారు పెరగడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేంద్రం 2021 నవంబర్ 15న ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని రకాల వసతులు ఉంటే రాత్రులలో సైతం పోస్టుమార్టం చేయ వచ్చు అని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేయకూడదన్నది తప్పడు సమాచారం, వదంతులు అని, రాత్రులలో కూడా పోస్టుమార్టం చేయవచ్చు అని వివరించారు.
ఆలస్యమే కారణం..
టీవీకే స్థానిక నేత మది అళగన్ విజ్ఞప్తి మేరకు వేలు స్వామి పురంను వేదికగా ఎంపిక చేసి, 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. అనుమతి సమయంలో ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల సలహా, ఆదేశాల మేరకు 11 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. కరూర్‌కు విజయ్ 12 గంటలకు ఆ పార్టీ ఎక్స్ పేజీలో పేర్కొనడంతో ఆ సమయానికే జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చేశారని వివరించారు. అయితే నిర్ణీత సమయంలో ఆయన రాలేదని, సాయంత్రం 4.45 గంటలకు కరూర్ సరిహద్దులలోకి ప్రవేశించినట్టు తెలియజేశారు. ఈ జాప్యం కారణంగా మదురై బైపాస్, కోయంబత్తూరు మార్గం, మునియనప్పన్ జంక్షన్, తిరుకాంబులియూరు జంక్షన్, వేలుస్వామి పురం మెయిన్ రోడ్డులలోకి జనం రాక మరింతగా పెరిగిందన్నారు. ఇక్కడి నుంచి విజయ్ నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారని, రాంగ్ రూట్‌లో ప్రవేశించడంతో ట్రాఫిక్ జాంతో పాటూ రద్దీ మరింత ఎక్కువ కావడంతో కట్టడి చేయడానికి తీవ్రంగా పోలీసులు శ్రమించినట్టు వివరించారు. రాజకీయ ఉద్దేశంతో అక్కడక్కడ ఆహ్వాన ఏర్పాట్లు చేసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పని గట్టుకుని జాప్యం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం. రాత్రి 7 గంటలకు వేలు స్వామి పురం వద్దకు విజయ్ వచ్చారని, అప్పటికే అక్కడ రద్దీ మరింతగా ఉండటంతో పదే పదే కట్టడి చేయాలని, జనం నీళ్లు, ఆహారం లేక నీరశించి ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, నిర్మల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినా ఖాతర చేయలేదని, జనం ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతారని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని పేర్కొనడం గమనార్హం. రద్దీ పెరిగే కొద్ది అక్కడున్న రేకుల షెడ్డులు, చెట్ల పైకి చేరిన వాళ్లు మరీ ఎక్కువ అని, అవి విరిగి పడడంతో ఎటు వెళ్లాలో తెలియక తోపులాట చోటు చేసుకుంది. విజయ్ ఆరు గంటలకు పైగా ఆలస్యంగా రావడం, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడం, జనాన్ని కట్టడి చేయడంలో విఫలం కావడం, వారికి కావాల్సిన నీళ్లు , ఆహారం లేక నీరసించి ఊపిరి ఆడక రద్దీలో సొమ్మసిల్లి పడి మరణించి వాళ్లే అధికం అని పేర్కొన్నారు. ఇది కూడా మరణాల సంఖ్య పెరిగేందుకు గల కారణాలుగా వివరించారు. పై నుంచి కింద పడ్డవారు, రద్దీలతో సొమ్మసిల్లిన వారు, పక్కనే ఉన్న కాలువలో జారి పడిన వాళ్లు అంటూ మరణాల సంఖ్య క్షణాలలో పెరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంటూ, నిబంధనల ఉల్లంఘణ, ఆలస్యమే ఉసురు తీసిందని స్పష్టం చేయడం గమనార్హం. 10 వేల మందికి ఉండాల్సిన చోట 20 వేల మందికి పైగా ఉండడం కూడా ప్రమాదానికి కారణాలుగా ప్రకటించారు.
అన్నీ నిబంధనలు ఉల్లంఘించారు
కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను సోమవారం రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది.
రంగంలోకి ఫోరెన్సిక్ బృందం
వేలు స్వామిపురంలో చిందర వందరంగా పడి ఉన్న చెప్పులు, వస్తువులును తొలగించ లేదు. ఆ పరిసరాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని మరింతగా విచారణ చేస్తున్నారు. తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి అనువణువు పరిశీలిస్తోంది. ఘటన రోజున డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన వీడియో ఫుట్టేజీలను విచారణ బృందం స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. కాగా తొక్కిసలాట సందర్భంగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, ఎత్తయిన ప్రాంతాలలో ఉన్న వారు తమ కెమెరాలలో బంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో రద్దీలో చిక్కుకున్న జనం పడ్డ నరకయాతన తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తోంది.

కొనసాగుతున్న అరుణాజగదీషన్ విచారణ

కొనసాగుతున్న అరుణాజగదీషన్ విచారణ