
ఏడాది చివరికి 50 ఆలయాల్లో కుంభాభిషేకం
– మంత్రి పి.కె. శేఖర్ బాబు వెల్లడి
కొరుక్కుపేట: చైన్నె జిల్లాలకు చెందిన జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారుల అధ్యయన బృందం హిందూ మత కమిషనర్ కార్యాలయంలో మంత్రి పి.కె. శేఖర్ బాబు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చైన్నె మండలాల్లో మాత్రమే ఒట్టేరి చెల్లపిళ్లైరాయర్ ఆలయం, విల్లివాక్కం, అగతీశ్వర ఆలయం, కొడుంగయ్యూరు అరుల్మిగు భవానీయమ్మన్ ఆలయం, కొండి తోపు కాశీ విశ్వనాథ ఆలయం, కొలత్తూరు సోమనాథ ఆలయం ఉన్నాయి. ఇంకా తేనంపేట్ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పోరూర్ రామ నాథీశ్వరర్ ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే ఈ సంవత్సరం చివరి నాటికి నాలుగు మండలాల్లోని 50 ఆలయాలను పునరుద్ధరించాలని, కుంభాభిషేకం నిర్వహించడానికి పనులను వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, చీఫ్ ఇంజినీర్ పి. పెరియసామి తదితరులు పాల్గొన్నారు.
తుపాకీ గురిపెట్టి 12 మంది మత్స్యకారుల అరెస్టు
– శ్రీలంక నేవీ దాష్టీకం
కొరుక్కుపేట: శ్రీలంక నావికాదళం తుపాకీతో బెదిరించి 12 మంది కారైకల్ మత్స్యకారుల అరెస్టు చేయడం కలకలం రేపింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని శ్రీలంక నావికాదళం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల అక్రమ నిర్బంధాన్ని అంతం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ శ్రీలంక నావికాదళం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా 12 మంది కారైకల్ మత్స్యకారులను తుపాకీ గురిపెట్టి అరెస్టు చేశారు. శ్రీలంక నావికాదళం చేసిన ఈ దుందుడుకు చర్య మత్స్యకారులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈనేపథ్యంలో శ్రీలంక నేవీ దురాక్రమణను ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆయుధ పూజ పండుగకు ప్రత్యేక రైళ్లు
తిరువొత్తియూరు: రాష్ట్ర ప్రజలు ఆయుధ పూజ, సరస్వతి పూజ బుధ, గురువారాల్లో జరుపుకోనున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సెలవులు వరుసగా వస్తున్నాయి. శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే వరుసగా 5 రోజులు సెలవు వస్తోంది. దీంతో పలువురు స్వస్థలాలకు వెళ్తున్నారు. రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. సెప్టెంబర్ 30 మంగళవారం చైన్నె నుంచి తిరువనంతపురం, సెంగోట్టై, మదురై వంటి ప్రత్యేక ప్రాంతాలకు రైళ్లు నడుపుతున్నారు. ఇక చైన్నె ఎగ్మూర్ నుంచి తిరువనంతపురానికి నేడు (మంగళవారం) రాత్రి 10.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2.05 గంటలకు తిరువనంతపురం నార్త్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే, అక్టోబర్ 5న తిరువనంతపురం నార్త్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఎగ్మూర్ చేరుకుంటుంది. ఈ రైలు పెరంబూర్, తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా నడుస్తుంది. తాంబరం నుంచి మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు సెంగోట్టైకి ప్రత్యేక రైలు నడుపనున్నారు. ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు సెంగోట్టై చేరుకుంటుంది. ఇది విలుప్పురం, అరియలూర్, తిరుచ్చి మీదుగా వెళ్లనుంది.
రామన్నతో సీవీ షణ్ముగం సమావేవం
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో సోమవారం తైలాపురంలో అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎంపీ సీవీ షణ్ముగం భేటీ అయ్యారు. గంటన్నర పాటుగా వీరి సమావేశం సాగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య బయల్దేరిన వివాదానికి కొలిక్కి తెచ్చే దిశగా బీజేపీ పెద్దలు దృష్టి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రాందాసుతో సీవీ షణ్ముగం సన్నిహితంగా మెలుగుతుండడం, తరచూ వీరు సమావేశం కావడాన్ని బీజేపీ అధిష్టానం పరిగణించినట్టు సమాచారం. రాందాసును అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చే వ్యూహంలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తొలుత విల్లుపరంలో సీవీ షణ్ముగంతో గత వారం చివర్లో భేటీ అయ్యారు. ఈ భేటీ తదుపరి సోమవారం ఉదయాన్నే సీవీ షణ్ముగం తైలాపురం వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీసింది. సుమారు గంటన్నర పాటుగా వీరి మధ్య రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు తైలాపురం వర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాలకు ముగింపు పలికే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు.