
కరూర్ ప్రమాదం.. ఘోర విషాదం
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ సోమవారం వీడియో విడుదల చేశారు. ఇది ఘోర విషాదం. భయంకరమైన విషాదం, గతంలో ఎన్నడూ తాను చూడ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి ఘటన ఎన్నడూ జరగ కూడదని వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రిలో తాను ప్రత్యక్షంగా చూసిన దృశ్యాలు మనస్సును ద్రవింప చేస్తున్నాయని, ఇంకా కళ్ల ముందే దృశ్యాలు కనిపిస్తున్నాయని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. బరువెక్కిన హృదయంతోనే తాను ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఘటన సమాచారంతో ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ఇంట్లో ఉండలేక తానూ స్వయంగా గురించి గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు అంటూ 41 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి మృతదేహాలు చూసిన సమయంలో, వారి కుటుంబాల వేదన తననుమరింతగా కలిచి వేశాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి జస్టిస్ అరునా జగదీశన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ లోపు సామాజిక మాధ్యమాలలో సాగుతున్న పుకార్లను నమ్మవద్దు అని విన్నవించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, అతని మద్దతుదారులైనా అమాయక పౌరులు ఇలాంటి కార్యక్రమాలలో చనిపోవాలని కోరుకోరు అని పేర్కొంటూ, ఈ ఘటనలో, మరణించిన వాళ్లు ఏ పార్టీకి చెందినవారు అన్నది ముఖ్యం కాదన్నారు. అందరూ తమిళులు అని, అందరూ తమిళ బంధాలు అని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విచారం, దుఃఖం చుట్టుముట్టబడిన ఈ సమరంలో బాధ్యతారహితమైన, హానికరమైన సందేశాలను నివారించాల్సిన అవశ్యం ఉందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు కొత్త మార్గదర్శకాలను తీర్చిదిద్దబోతున్నామన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నియమ, నిబంధనలు విధిస్తామని, రాజకీయ వైరుధ్యాలు, విధాన వైరుధ్యాలు, వ్యక్తిగత శత్రుత్వాలను పక్కన పెట్టి, అందరూ, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని విన్నవించారు. తమిళనాడు ఎల్లప్పుడూ దేశానికి అనేక విధాలుగా మార్గదర్శకంగా ఉంటోందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడం అందరి కర్తవ్యంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించి ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు. ఇక, దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పర్యటనను రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సోమవారం మళ్లీ తన ప్రయాణాన్ని చేపట్టారు.
సీఎం స్టాలిన్