
బీజేపీ నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై సమగ్ర విచారణకు బీజేపీ నేతృత్వంలో జాతీయ అధిష్టానం నిజనిర్ధాణ కమిటీని నియమించింది. ఎంపీ హేమామాలిని నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైనట్టు ఢిల్లీ నుంచి సమాచారం వెలువడింది. ఈ పరిస్థితులలో కరూర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రి ఎల్. మురుగన్ సోమవారం పర్యటించారు. ఘటన జరిగిన వేలు స్వామి పురంను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను గురించి కలెక్టర్ తంగ వేల్ అన్ని వివరాలను వారికి తెలియజేశారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చరు. నిర్మలా సీతారామన్ వెన్నంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో పాటూ ముఖ్య నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా కరూర్ ఘటన పై సమగ్ర విచారణకు బీజేపీ జాతీయ అధిష్టానం సైతం నిర్ణయించింది. ఎంపీ హేమామాలిని నేతృత్వంలో తేజస్వీ సూర్య తదితర ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల కూడిన 8 మందితో ఈ కమిటీని నియమించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కమిటీకి హేమామాలిని నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఈ బృందం మంగళ వారం లేదా గురువారం కరూర్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.