
మొరాయించిన సర్వర్
తిరువళ్లూరు: రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయింది. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా తిరువళ్లూరు, మనవాలనగర్, ఊత్తుకోట, పొన్నేరి, గుమ్మిడిపూండి, పేరంబాక్కం, పూందమల్లితోపాటు పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పని చేస్తున్నాయి. ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జనన, మరణాలు, వివాహం, భూముల రిజిస్ట్రేషన్‌లు, కాపీ ఆప్ డాక్యుమెంట్, ఈసీతో సహా 23 రకాల సేవలను అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధిచి ఆన్‌లైన్ పద్ధతిలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మంచి రోజు కావడంతో వివాహ, భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తిరువళ్లూరులో మూడువందల మంది దరఖాస్తు చేసుకుని టోకెన్‌లను పొందారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం అధికారులు, రిజిస్ట్రేషన్ చేయడానికి టోకెన్‌లు పొందిన వారు ఉదయం పది గంటలకే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సర్వర్ మొరాయించడంతో జనం పడిగాపులు కాశారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సర్వర్ పని చేయడం ప్రారంభించింది. దీంతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ మెల్లగా నడిచింది. సర్వర్ మొరాయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.