
అవకాశాల కోసం అడగలేదు..
తమిళసినిమా: నటుడు రంజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇరుదు ముయర్చి. నటి మేగలి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వరం సినిమాస్ పతాకంపై వెంకటేశన్ పళనిస్వామి నిర్మించారు. వెంకట్ జనా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ఈ వేదికపై చిత్ర దర్శకుడు వెంకట్ జనా మాట్లాడుతూ తన గత ఐదేళ్ల క్రితం తిరుపూర్‌లో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం ఇదని చెప్పారు. ఓ వ్యాపారవేత్త కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడతాడన్నారు. ఆ ఘటనకు కారణాలేమిటి? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఇరుదు ముయర్చి చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ కథలో ఒక ఆత్మ ఉందని, అదే అందరినీ బాగా నటించేలా చేసిందని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రంజిత్ మాట్లాడుతూ కోడంబాక్కమ్, వడపళని,సాలిగ్రామం రోడ్లలో 30 ఏళ్ల ముందు పయనించినప్పుడు, ఇప్పుడు పయనిస్తున్నప్పుడు మనసు బరువెక్కుతుందన్నారు. ఎందుకంటే సినిమాల్లో ఏదో ఒక్క రోజు సాధించలేమా అని జీవితాలను త్యాగం చేసిన వారి సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. తన విషయానికి వస్తే తానెప్పుడూ అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లలేదన్నారు. ఒక సారి దర్శకుడు ఆర్కే సెల్వమణి తన ఫొటోను చూసి ఆఫీస్‌కు పిలిపించి నటించే అవకాశాన్ని కల్పించారన్నారు. అలా అయన్ని కలిసి హీరోగా ఎంపిక అయ్యేవరకూ వణుకు పుట్టిందన్నారు. ఆ రోజుల్లో కథకు సరిపోయే నటులనే దర్శకులు ఎంపిక చేసేవారని చెప్పారు. అలా ఆర్కే సెల్వమణి కథకు తాను సరిగా ఉంటానని భావించడంతోనే తాను హీరోగా ఎంపికయ్యానని పేర్కొన్నారు. ఇక ఇరుదు ముయర్చి చిత్రం విషయానికి వస్తే దర్శకుడు వెంకట్ జనా తనను కలిసి కథ చెప్పారన్నారు. ముందుగా తాను నటించడానికి సందేహించానని, అయితే కథ తనను ఆకట్టుకోవడంతో నటించడానికి సమ్మతించినట్లు చెప్పారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో సంతృప్తిని కలిగించిన చిత్రం ఇదని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చిన అజయ్ ఫిలింస్ ఫ్యాక్టరీ అధినేత అజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అవకాశాల కోసం అడగలేదు..