
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
వేలూరు: దివ్యాంగుల సమస్యలపై విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మారు మూల గ్రామాల నుంచి వికలాంగులు, వృద్ధులు ఎంతో కష్టపడి కలెక్టరేట్ చేరుకొని వినతులు అందజేస్తున్నారని వీటిపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. అర్జీ దారులను కార్యాలయాల చుట్టూ తిప్పించకుండా వారికి పరిష్కార మార్గం చూపాలన్నారు. అనంతరం అంతర్జాతీయ చెవిటి మూగ దినోత్సవాన్ని పురష్కరించుకుని అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సత్‌వచ్చారి, హోలీక్రాస్ పాఠశాల తదితర ప్రాంతాలకు వెళ్లి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ముందుగా జిల్లాలోని పోలీసు అధికారులతో శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.