
ఉచిత ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా
తిరువళ్లూరు: జాతీయ రహదారి నిర్మాణం కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పట్రపెరంబదూరు గ్రామానికి చెందిన బాధితులు సోమవారం ఉదయం తిరువళ్లూరులో ధర్నా నిర్వహించారు. చైన్నె–తిరుపతి మధ్య జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం పట్రపెరంబదూరు గ్రామానికి చెందిన సుమారు వంద ఇళ్లను తొలగించి నామమాత్రపు పరిహారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయమైన పరిహారం అందజేయడంతోపాటు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను కేటాయించాలని కోరుతూ బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.